అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, జెంటిల్మెన్ సినిమాలతో తనకంటూ ఓ క్లాస్ ముద్రను వేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. సకుటుంబ సపరివార సమేతంగా చూసే సినిమాలు తీయడంలో దిట్ట. ఓ హిట్టు పడగానే ఆటోమెటిగ్గా దర్శకుల చూపు స్టార్ హీరోలపై పడుతుంది. కానీ ఇంద్రగంటి మాత్రం ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికీ `చిన్న హీరోలు, చిన్న సినిమాలే నాకు బెటర్` అంటున్నారయన.
”స్టార్ హీరోలతో సినిమాలు తీయాలంటే నాకు భయం. అన్ని స్కిల్స్ కూడా నాకు లేవు. వాళ్ల ఇమేజ్‌నీ, అభిమానుల అంచనాల్నీ దృష్టిలో ఉంచుకుంటూ కమర్షియల్ హంగుల్ని జోడిస్తూ కథ రాసుకోవడం ఓ టెక్నిక్. పెద్ద హీరో అనగానే పెద్ద స్పాన్ ఉన్న కథే రాసుకోవాలి. ఇవన్నీ నాకు తెలీవు. అందుకే పెద్ద హీరోల కోసం ఎప్పుడూ కథలు సిద్ధం చేసుకోలేదు. వాళ్లని కలిసి కథలు చెప్పే ప్రయత్నం చేయలేదు” అన్నారాయన. త్వరలోనే విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నారు ఇంద్రగంటి. అయితే.. ఆ సినిమా కాస్త ఆలస్యమయ్యేట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఇంద్రగంటి సైతం ఒప్పుకున్నారు.
”విజయ్‌తో ఓ సినిమా చేయాలి. కథ సిద్ధమైంది. అయితే.. విజయ్ నాకు అందుబాటులో రావడానికి టైమ్ పడుతుంది. ఫైటర్ పూర్తయ్యాక మరో రెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తాడు. ఆ తరవాతే.. నాతో సినిమా ఉంటుంది. నా దగ్గర రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. అవి ఎవరికి సరిపోతాయో.. చూసుకుని, ఆ హీరోల్ని సంప్రదిస్తా” అన్నారు. ఇంద్రగంటి దర్శకత్వం వహించిన `వి` సెప్టెంబరు 5న అమేజాన్ లో విడుదల కానుంది.