దేశ స్థూల జాతీయోత్పత్తి.. రెండు శాతమో.. మూడు శాతమో పెరగడమే చూశాం కానీ.. మైనస్‌లోకి వెళ్లడం అరుదు. కానీ ఇప్పుడు భారత జీడీపీ మైనస్‌ల్లోకి వెళ్లడం కాదు.. పాతాళంలోకి పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో తగ్గిన భారత జీడీపీ మైనస్ 23.9 శాతంగా తేలింది. అంతకు ముందు మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల కాలానికి 3.1 శాతం వృద్ధి నమోదైంది. ఈ వృద్ధి పోగా.. మైనస్ 23.9 శాతం పతనం నమోదైంది. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి నెలలో 12.1 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని అంచనా.
లాక్డౌన్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ముందుగా అంచనా వేయకుండా… నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇదని సులువుగానే గుర్తించవచ్చు. లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వ్యాపారాలు, ఉద్యోగాలు, ప్రజల జీవనోపాధి దారుణంగా దెబ్బతిన్నది. ప్రస్తుతం.. లాక్ డౌన్ ఎత్తివేస్తున్నప్పటికీ.. ఆ ప్రభావం చాలా కాలం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే మూడు నెలల్లోనూ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోకపోతే… మాంద్యం వచ్చినట్లుగానే భావిస్తారు. ఇప్పటికే కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. మళ్లీ పూర్వ స్థాయిలో ప్రజలకు ఉపాధి లభించినప్పుడే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. వరుసగా రెండు క్వార్టర్ల పాటు.. జీడీపీ తగ్గిపోతే… ఆర్థిక మాంద్యం వచ్చినట్లుగా భ ఆవిస్తారు.
లాక్ డౌన్ పేరుతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకున్నప్పటికీ.. కరోనా వైరస్ భారత్‌లో అదుపులోకి రాలేదు. ప్రపంచంలోని మరే దేశంలోనూ రోజు వారీగా నమోదవనంత భారీగా కేసులు నమోదవుతున్నాయి. అందుకే భారత్ వేగంగా కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. వినియోగదారుల నుంచి డిమాండ్ ఇప్పుడప్పుడే పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. జనాలు అత్యవసరమైన వస్తువులను కొనేందుకు మాత్రమే బయటకు వస్తున్నారు. జీడీపీలో 60 శాతాన్ని ప్రభావితం చేసేది డిమాండే.