ఆంధ్రప్రదేశ్లో కరోనా మరణాలు నాలుగు వేలు దాటిపోయాయి. గత ఇరవై నాలుగు గంటల్లో చనిపోయిన వారి సంఖ్య 84గా నమోదయింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకూ.. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు 4053మందిగా లెక్క తేలారు. నమోదవుతున్న కేసులు కూడా పదివేలకుపైగానే ఉంటున్నాయి. ఒక్క రోజులో 10368 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజుకు పదివేలకుపైగా నమోదవడం సహజంగా మారింది. ఇప్పటికి యాక్టివ్ కేసులు లక్షకుపైగానే ఉన్నాయి.
ఇలా యాక్టివ్ కేసులు.. మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే అత్యధికం ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఏ రోజూ.. అక్కడ వెయ్యికు తక్కువగా కేసులు నమోదు కావడం లేదు. మరణాల్లో చిత్తూరు జిల్లాలో ఎక్కువగా నష్టం జరుగుతోంది. ప్రస్తుతానికి టెస్టులు చేసి.. కరోనా కేసులు గుర్తించడానికి ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోంది.
కానీ కరోనా కట్టడికి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కరోనా ప్రాణాంతకంగా మారింది. ఆ పరిస్థితి.. మరణాల్లో కనిపిస్తోంది. రోజు రోజుకు మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. పెరుగుతున్న కేసుల బట్టి చూస్తే… మరికొంత మంది ఆంధ్రులు కరోనాకు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.