రాజన్న పాలన తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి … రాజశేఖర్ రెడ్డి ఫ్లాగ్ షిప్ పథకాలకు.. ఆయన ఆలోచనలకు మాత్రం గండికొట్టేస్తున్నారు. రైతుల బోర్లకు కరెంట్ మీటర్లు ఉండకూడదనేది.. వైఎస్ సిద్ధాంతం. రైతులకు ఎంత కరెంట్ కావాలంటే అంత వాడుకుని వ్యవసాయం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించేవారు. ఎన్టీఆర్ టైంలో హార్స్పవర్కు రెండు రూపాయలు.. ఇలా బిల్లులు వసూలు చేసేవారు. ఇలా చేయడం కూడా రైతులకు భారమేనని ఆయన ఉద్యమం లేవదీశారు. అసలు మీటర్లు ఉండకూడదని… కనీసం రోజుకు ఆరు గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. దానికి తగ్గట్లుగా.. ఆయన తన ఎన్నికల మేనిఫెస్టోను కూడా రూపుదిద్దుకున్నారు. 2004లో వైఎస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఉచిత విద్యుత్.
తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని.. ఆరు గంటలు నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తామని.. అదే సమయంలో.. రైతుల బోర్లకు మీటర్లే బిగించబోమని హామీ ఇచ్చారు. ఇది రైతుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ఆయన ఘన విజయం సాధించారు. ఈ ఉచిత విద్యుత్ పథకం జోలికి తర్వాత ఏ ప్రభుత్వమూ వెళ్లలేదు. రైతుల్లో వచ్చిన ఆదరణ చూసి.. ఇంకా ఎక్కువ సమయం ఇస్తామని చెప్పడం ప్రారంభించాయి. అలాంటి ఫ్లాగ్ షిప్ పథకంలో జగన్మోహన్ రెడ్డి మార్పులు చేస్తున్నారు. వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించారు. అలాగే.. నెలవారీ బిల్లులు కూడా జారీ చేస్తారు. అ బిల్లుల మొత్తాన్ని రైతుల అకౌంట్కు వేస్తామని.. వారు ఆ మొత్తాన్ని బిల్లు చెల్లిస్తే చాలని చెబుతున్నారు.
కానీ ప్రభుత్వం జీతాలే పూర్తి స్థాయిలో… సరైన సమయానికి చెల్లించలేకపోతోంది. ఇక రైతుల ఉచిత విద్యుత్ బిల్లులు ఎలా అకౌంట్లో వేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే.. అదే రైతులకు నేరుగా సరఫరా చేసి.. ఆ కట్టేదేదో… విద్యుత్ సంస్థలే కడితే.. ప్రభుత్వం వద్ద నిధులున్నప్పుడు చెల్లిస్తే సరిపోతుంది. చెల్లించకపోయినా అడిగేవారుండరు. ఎందుకంటే.. విద్యుత్ సంస్థలు కూడా ప్రభుత్వానివే. దీంతో… రైతుల వరకూ నిధుల సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల.. రైతులు డబ్బులు కట్టాల్సి వస్తుంది. కట్టలేకపోతే.. కరెంట్ కనెక్షన్ తొలగించడానికి కూడా చాన్స్ ఉంది.
గతంలో గ్యాస్ సిలిండర్లకు… సబ్సిడీ ప్రభుత్వమే నేరుగా చెల్లించేది. కానీ యూపీఏ ప్రభుత్వం నగదు బదిలీ చేయాలనకుంది. బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. తీరా అధికారంలోకి వచ్చాక.. నగదు బదిలీ అమలు చేస్తోంది. మొదట్లో… మూడు నాలుగు వందల మేర వచ్చే సబ్సిడీ.. ఇప్పుడు.. రూ. 20, 30 మాత్రమే లబ్దిదారులకు అందుతోంది. రైతులకు ఉచిత విద్యుత్ విషయంలోనూ.. బిల్లులు వేలల్లో వచ్చి.. ప్రభుత్వం వందల్లో జమ చేస్తే.. రైతులు అన్యాయమైపోతారు. అందుకే రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైఎస్ పథకాన్ని యథావిధిగా ఉంచాలని రైతులు కోరుకుంటున్నారు.