నిమ్మగడ్డ రమేష్.. పోతినేని రమేష్.. ఎవరినైనా సరే వదిలేది లేదంటోంది ఏపీ ప్రభుత్వం. నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ.. మళ్లీ పోతినేని రమేష్ విషయంలోనూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. రమేష్ ఆస్పత్రి ఘటన విషయంలో ఎఫ్ఐఆర్పై స్టే విధించిన హైకోర్టు.. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇది ఏపీ ప్రభుత్వానికి నచ్చలేదు. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించుకుంది.
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం విషయంలో అనుమతులు ఇచ్చిన కలెక్టర్ , సబ్ కలెక్టర్, డీఎం అండ్ హెచ్వోలను ఎందుకు బాధ్యలుగా చేయలేదని… హైకోర్టు కేసు విచారణ సందర్భంగా ప్రశ్నించింది. అగ్నిప్రమాదం ఘటన జరిగిన తర్వాత.. హోటల్ నిర్వహణ చూస్తున్న యాజమాన్యాన్ని కాకుండా… ఆస్పత్రిని టార్గెట్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా పోతినేని రమేష్ ను అరెస్ట్ చేయాలన్న పట్టుదలకు పోయారు. ఆయన ఆచూకీ చెబితే లక్ష ఇస్తామన్న ప్రకటనను స్వయంగా పోలీస్ కమిషనర్ చేశారు. దీనిపై వైద్యుల సంఘాలు మండిపడ్డాయి.
రమేష్ ఆస్పత్రి విషయంలో ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్న చర్యలన్నీ కక్ష పూరితంగా సాగుతున్నాయన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి. అదే సమయంలో స్వర్ణా ప్యాలెస్లో కోవిడ్ సెంటర్ నిర్వహించడానికి అన్ని రకాల అనుమతులు ఇచ్చిన అధికారులను ఎందుకు ప్రశ్నించలేదనే చర్చ కూడా ప్రారంభమయింది. ప్రభుత్వం రకరకాల కమిటీలను విచారణకు నియమించింది. ఆ కమిటీలు కూడా.. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న విషయం వదిలి పెట్టి రమేష్ ఆస్పత్రి తప్పొప్పులు చెప్పడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు.. మొత్తంగా కేసు విచారణ జరుపుతున్న తీరునే ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్పై స్టే విధించింది. ఇప్పుడు ఈ స్టే ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేయబోతోంది. అక్కడా.. అధికారులను బాధ్యులను చేయాలని చెబితే.. డాక్టర్ రమేష్ కన్నా ముందు ఉన్నతాధికారులు ఇరుక్కుపోతారు.