ప్రస్తుతం ఓటీటీ విప్లవం నడుస్తోంది. కథల కోసం.. సింపుల్‌గా ఉంటాయని బయోపిక్‌లు ఎంచుకుంటున్నారు. సాధారణంగా సినిమాలకైనా.. ఓటీటీలకైనా “మంచి” కథలు చెబితే వర్కవుట్ కావు. చెడే చెప్పాలి. మంచి వాళ్లు చేసిన చెడు అయినా చెప్పాలి. ఆ కోణంలో.. అనేక మంది బయోపిక్‌లు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. అలా సత్యం రామలింగరాజు బయోపిక్ ను కూడా తీసేశారు. “బ్యాడ్ బాయ్ బిలియనీర్” పేరుతో తీసిన ఈ బయోపిక్ .. కొద్దిరోజుల్లో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కావాల్సి ఉంది. కానీ..ఇది తన గురించి తీసిన సినిమానే అని గుర్తించిన సత్యం రామలింగరాజు.. కోర్టుకెళ్లారు. తనపై దిగువ కోర్టు వేసిన శిక్షపై తాను పైకోర్టులో అప్పీల్ చేసి ఉన్నానని ఇలాంటి సమయంలో.. తనపై వెబ్ సిరీస్ తీయడం.. కరెక్ట్ కాదని.. దాన్ని ప్రసారం చేయకుండా నిలిపివేయాలని కోరుతూ… పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన కోర్టు బ్యాడ్ బాయ్ బిలియనీర్ విడుదలపై స్టే ఇచ్చింది.
ఈ కారణంగా నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కావడం లేదు. అయితే.. నెట్ ఫ్లిక్స్.. అది సత్యం రామలింగరాజు బయోపిక్ అని చెప్పడం లేదు. కానీ.. రామలింగరాజు మాత్రం.. తన జీవిత కథనే తీస్తున్నారన్న అనుమానంతో కోర్టుకెళ్లారు. వెబ్ సిరీస్‌ను నిలిపివేయగలిగారు. ఇప్పటి వరకూ.. రామ్ గోపాల్ వర్మ.. అనేక రకాల బీభత్స బయోపిక్ లు తీస్తున్నారు. ఆయనను ఎవరూ అడ్డుకోలేకపోయారు. కోర్టులకు వెళ్లి.. పేర్లు మాత్రం అటూ ఇటుగా మార్పించగలిగారు కానీ.. అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు.. రామలింగరాజు బయోపిక్ అయినా… కొన్ని రోజులు మాత్రమే అడ్డుకోగలరని.. తర్వాత అయినా ప్రసారం అవుతుందని అంచనా వేస్తున్నారు.
సత్యం రామలింగరాజు… దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న దశలో సత్యం కంప్యూటర్స్‌ను స్థాపించి… సంచలనం సృష్టించారు. ఆ సంస్థను.. నాస్‌డాక్‌లోనూ లిస్ట్ చేయించగలిగారు. కానీ.. మధ్యలో సంస్థ నుంచి నగదును రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు మళ్లించడం.. లాభాలు .. ఆదాయాలు ఎక్కువగా చూపడం వంటి వాటికి పాల్పడి… మునిగిపోయారు. ఈ క్రమంలోనే.. బ్యాడ్ బాయ్ బిలియనీర్ రూపుదిద్దుకున్నట్లుగా చెబుతున్నారు.