పఠాన్ కోట్ పై పాక్ ఉగ్రవాదుల దాడి తరువాత భారత్-పాక్ దేశాల మధ్య గంభీరమయిన వాతావరణం నెలకొని ఉంది. ఆ దాడికి కుట్రపన్నిన వారిని కనిపెట్టేందుకు మరిన్ని ఆధారాలు కావాలని పాక్ ప్రభుత్వం కోరడంతో వారిపై ఎటువంటి చర్యలు తీసుకొనేందుకు అది సిద్దంగా లేదనే సంగతి చెప్పకనే చెప్పినట్లయింది. అయినప్పటికీ భారత్ చాలా సంయమనంగా వ్యవహరిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో వరుసగా జరిగిన కొన్ని పరిణామాలు భారత్-పాక్ మధ్య దూరాన్ని మరింత పెంచాయి.
భారత్ పై దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీ మరియు ఐ.ఎస్.ఐ.అధికారులే అవసరమయిన అన్ని సహాయసహకారాలు అందజేస్తున్నారని డేవిడ్ హెడ్లీ తన వాంగ్మూలంలో విస్పష్టంగా చెప్పాడు. అతని మాటలని పాక్ చాలా తేలికగా కొట్టి పడేసింది కానీ భారత్ మాత్రం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో అమెరికా పాకిస్తాన్ కి అత్యాధునిక ఎఫ్-16 యుద్ద విమానాలను అమ్మింది. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకే యుద్ద విమానాలు సరఫరా చేస్తున్నామని అమెరికా చెప్పుతోంది. కానీ భారత్ ని దృష్టిలో పెట్టుకొనే వాటిని పాక్ సమకూర్చుకొందనే విషయం బహిరంగ రహస్యమే.
పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన వారిని పట్టుకొనేందుకు పాక్ ప్రభుత్వంపై భారత్ ఒత్తిడి చేస్తున్న సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయసహకారాలు అందజేస్తున్న సంగతి తెలిసి ఉన్నప్పటికీ అమెరికా ఎఫ్-16 యుద్ద విమానాలను సరఫరా చేయడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించి, అభ్యంతరం వ్యక్తం చేసింది. దానిని పాకిస్తాన్ తప్పు పట్టింది. తమ దేశంతో పోలిస్తే భారత్ వద్ద అత్యాదునికమయిన యుద్ధవిమానాలు చాలా ఉన్నాయని, తాము కొన్నిటిని సమకూర్చుకొంటే దానికి భారత్ అభ్యంతరం చెప్పడం తగదని పాక్ వాదన. బహుశః అందుకే పాకిస్తాన్ ఆర్మీ మరియు ఐ.ఎస్.ఐ. అధికారులు ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడులకు పంపించారేమోనని అనుమానించవలసి వస్తోంది. అటువంటప్పుడు ఆ కుట్ర పన్నిన వారిని పాక్ పట్టుకొని చర్యలు తీసుకొంటుందని ఆశించడం అవివేకమే అవుతుంది.
పఠాన్ కోట్ దాడి జరిగినప్పటి నుండి పాక్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఈ యుద్ద విమానాల వివాదం తలెత్తడంతో ఇప్పుడు పాక్ ప్రభుత్వం కూడా భారత్ ని వేలెత్తి చూపే అవకాశం దక్కింది. ఈ కారణంగా భారత్-పాక్ మధ్య శాంతి చర్చలు జరిగే అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఉగ్రవాదులను అప్పగించే విషయంలో పాక్ పై ఒత్తిడి చేయవలసిన అమెరికా దానికి యుద్ధవిమానాలు అందించడం ద్వారా పాకిస్తాన్ కే మద్దతు తెలిపినట్లయింది. కనుక ఇక పాకిస్తాన్ కూడా భారత్ చేసే ఒత్తిళ్లకు లొంగక పోవచ్చును. ఈవిధంగా పాకిస్తాన్, అమెరికాలు తమ ద్వంద వైఖరిని మరొకసారి బయటపెట్టుకొన్నట్లయింది.