ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ కింద కేంద్రం నుంచిసాయం పొందేందుకు ఏపీ సర్కార్.. శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం కేంద్రం పెట్టిన షరతులను వరుసగా నేరవేర్చుకుంటూ పోతోంది. ముఖ్యంగా విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం… రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నా వెనక్కి తగ్గడం లేదు. ఉచిత విద్యుత్‌కు బదులు నగదు బదిలీ పథకాన్ని ఇప్పటికే అమలు చేయడానికి ఆదేశాలిచ్చిన ప్రభుత్వం… ఇప్పటి వరకూ.. ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు బాకీ ఉన్న మొత్తాలను చెల్లించడానికి సిద్దమయింది.
ఎన్టీపీసీ నుంచి డిస్కమ్‌లు కొనుగోలు చేసి పంపిణీ చేసిన విద్యుత్‌కు ఏపీ సర్కార్ పెద్ద ఎత్తున రాయితీ చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి రూ. 900 కోట్ల రాయితీ చెల్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రాయితీ చాలా కాలంగా ప్రభుత్వం తొక్కి పెట్టింది. ఆత్మనిర్భర్‌లో భాగంగా రూ.ఐదు వేల కోట్ల సాయం పొందాలంటే… తక్షణం ఆ బాకీలన్నీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల ఖర్చులు… ఇతర అవసరాల కోసం.. ఏపీ సర్కార్ కు పెద్ద ఎత్తున నిధులు అవసరం ఈ కారణంగా కేంద్రం ఏం షరతులు పెట్టినా చేస్తోంది.
మరి అన్ని చేసినా… కేంద్రం చివరిలో ఏదో మెలిక పెట్టి… ఆత్మ నిర్బర్ ప్యాకేజీ నిధులు విడుదల చేయకపోతే.. ఏపీ సర్కార్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అవుతుంది. ఎందుకంటే… ఉన్న నిధులన్నీ… డిస్కమ్‌లకు చెల్లించేస్తోంది మరి..!