తెలంగాణ ప్రభుత్వ ఆదాయం సాధారణ స్థితికి చేరుతోంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఐదు నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి ఆగస్టు నెల ఆశలు కల్పించింది. లాక్ డౌన్ నిబంధనలు సరళీకరించడంతో… ఆదాయం కూడా బాగా మెరుగుపడింది. ఆగస్టు నెలలో అన్ని రకాల ఆదాయాలు కలుపుకుని రూ. రూ.13 వేల కోట్ల వరకూ తెలంగాణ సర్కార్కు వచ్చింది. దీంతో అప్పులపై పెద్ద ఎత్తున ఆధారాపడే పరిస్థితి తగ్గిపోయింది. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నుల శాఖల నుంచి ఆదాయం… గతంలోలా కాకపోయినా… సంతృప్తికరంగా పెరిగిందని.. ప్రభుత్వం భావిస్తోంది.
కరోనా లాక్ డౌన్ కారణంగా… ఏప్రిల్లో ఏకంగా 83 శాతం ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఆ నెలలో కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా కూడా కలుపుకుని వచ్చింది.. రూ.3,377 కోట్లు మాత్రమే. ఆ తర్వాత కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత జూన్లో రూ.6,975 కోట్లు వచ్చింది. మరో రెండు నెలల తర్వాత ఇది రెట్టింపయింది. తెలంగాణలో మద్యం విధానం గందరగోళంగా లేదు. ధరలు కూడా భారీగా పెంచలేదు. దాంతో.. ఎక్కడా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రావడం… నాటు సారాకు అలవాటు పడటం లాంటివి లేకపోవడంతో.. మద్యం అమ్మకాలు సాధారణ స్థితికి వచ్చాయి.
ఇక దేశం మొత్తం మాంద్యం గుప్పిట్లో చిక్కుకుంటోందన్న ఆందోళనలు వ్యక్తమయినప్పటికీ… ఆస్తుల లావాదేవీలు.. హైదరాబాద్లో ఆశాజనకంగా సాగుతున్నాయి. ఆగస్టులో మద్యం, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7 వేల కోట్లకు ఆదాయం వచ్చింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో నిర్మాణ రంగంతోపాటు ఇతర రంగాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో హోటళ్లు, ఇతర సేవా రంగాల కార్యకలాపాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనాకు ముందు అంచనా వేసిన బడ్జెట్ అంచనాల ప్రకారం ఇంకా.. రావడం లేదు. కానీ.. రెండు నెలల్లో ఆ స్థాయి ఆదాయం వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.