తెలంగాణలో నాలుగైదు రోజులుగా… మావోయిస్టు అగ్రనేతలంతా లొంగిపోతారనే ప్రచారం ఊపందుకుంది. దశాబ్దాల పాటు అడవులకే పరిమితమైన విప్లవం కోసం పని చేసిన వారంతా.. తెలంగాణ పోలీసులఎదుట లొంగిపోయేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని చెబుతున్నారు. వారి తరలపై ఒక్కొక్కరిపై రూ. ఇరవై లక్షల నుంచి 50 లక్షల వరకూ రివార్డు ఉంది. వారు లొంగిపోతే ఆ రివార్డును వారికే ఇస్తారు. మల్లోజుల వేణుగోపాల్, గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు వంటి అగ్రనేతలు లొంగుబాటు జాబితాలో ఉన్నారు. వీరితో పాటు మొత్తం ఐదుగురు లొంగిపోతారని అంటున్నారు.
మావోయిస్టు పార్టీలో ఈ ఐదుగురు టాప్ ఫైవ్ లాంటి వారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి గోవా నుంచి కేరళలోని ఇడుక్కి వరకు మావోయిస్టు గెరిల్లా జోన్‌ను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. 2010లో దంతెవాడ దాడిలో 70 మంది భద్రతా సిబ్బందిని హతమార్చడంలో వేణుగోపాల్దే మాస్టర్ మైండ్ అని పోలీసులు చెబుతూంటారు. బెంగాల్‌లోని ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న లాల్‌గఢ్ ఉద్యమానికి నిన్నటి వరకూ నాయకునిగా వ్యవహరిస్తున్నారు. మిగతవారు చిన్న చిన్న వ్యక్తులు కాదు.
మావోయిస్ట్ పార్టీ అగ్రనేతల లొంగుబాటుకు తెలంగాణ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతూ లొంగుబాటుకు చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించారు. అగ్రనేతల లొంగుబాటు ప్రచారం జోరుగా సాగుతూండగా… ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న యువ నక్సలైట్ల కోసం పోలీసులు వేట ఉద్ధృతం చేశారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతాల్లో సీక్రెట్‌గా పర్యటిస్తున్నారు. అక్కడ ఓ దళం తిరుగుతోంది. ఆ దళం సంగతి తేల్చాలని.. ప్రయత్నిస్తున్నారు. దళం ఆచూకీ తెలిపిన వారికి పెద్ద ఎత్తున నగదు బహుమతి ఆఫర్ చేశారు. రేపో మాపో… మావోయిస్టులకు సంబంధించి.. ఓ బిగ్ బ్రేకింగ్ మాత్రం టీవీ చానళ్ల తెరపై కదలాడనుందని.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.