వి సినిమాతో కొత్త లెక్కలు మొదలవుతున్నాయి. ఓటీటీలోకి వెళ్తున్న పెద్ద సినిమా ఇదే. ఈ సినిమా ఫలితాన్ని బట్టే – ఓటీటీకి వెళ్లాలా, వద్దా? అనే విషయాన్ని ఇంకొన్ని సినిమాలు తేల్చుకోబోతున్నాయి. మరోవైపు ఈ సినిమా నానికి మరింత స్పెషల్ గా మారింది. కథానాయకుడిగా తన 25వ సినిమా ఇది. ప్రతినాయకుడిగా చేస్తున్న తొలి ప్రయత్నమిది. తనకు అచ్చొచ్చిన సెప్టెంబరు 5న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నానితో చేసిన చిట్ చాట్ ఇది.
హాయ్ నాని..
హాయ్ అండీ…
కథానాయకుడిగా మీ తొలి సినిమా సెప్టెంబరు5నే విడుదలైంది. 25వ సినిమానీ అదే రోజు విడుదల చేస్తున్నారు. ఇదంతా మీ ప్లానింగేనా?
లేదండీ. సెప్టెంబరు 5న రావాలని నేనేం ప్లాన్ చేయలేదు. అమేజాన్ వారి ప్లానింగ్ ఇది. సినిమా వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయాక.. రిలీజ్ డేట్ వాళ్లే ఫిక్స్ చేసుకుంటారు. సెప్టెంబరు 5న అయితే స్పెషల్ గా ఉంటుందని అమేజాన్ భావించి ఉంటుంది.
ప్రతీ సారీ మీ సినిమాని మార్నింగ్ షో థియేటర్లో చూసుకోవడం అలవాటు కదా..? అది ఈసారి మిస్ అవుతున్నారా?
మిస్ అవ్వకూడదనే.. ముందుగానే ఓ థియేటర్ బుక్ చేసి, మా కుటుంబ సభ్యులంతా.. ఈ సినిమాని చూసేశాం.
థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి?
ఉగాదిన విడుదల చేద్దామనుకున్న సినిమా ఇది. రిలీజ్ డేట్ ప్రకటించేశాం. కానీ ఆ తరవాత లాక్ డౌన్
ఎఫెక్ట్ మొదలవ్వడంతో.. సినిమాని వాయిదా వేసేశాం. ఈనెల కాకపోతే, మరో నెల అంటూ 5 నెలలు ఎదురు చూశాం. ఎన్ని రోజులు ఎదురు చూసినా.. పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. అందుకే… ఓటీటీకి ఇచ్చేశాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీనే మంచి ఆప్షన్ అనిపించింది.
ఓటీటీకి ఇచ్చే విషయంలో చాలా తర్జనభర్జనలు జరిగాయట కదా?
అవును. కాకపోతే.. నిర్మాతగా దిల్ రాజు గారి అభిప్రాయానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే.. ఓ నిర్మాతగా ఆయన ఎంతమందికి సమాధానం చెప్పుకోవాలో నాకు బాగా తెలుసు. ఇలాంటి సమయంలో.. ఆయనకు అండగా ఉండాలనుకున్నాం.
కరోనా ఎఫెక్ట్ వల్ల చిత్రసీమ బాగా నష్టపోతోంది. కథానాయకులు, దర్శకులు పారితోషికాలు తగ్గించుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓ నిర్మాతగా విషయంపై మీరెలా స్పందిస్తారు?
తప్పకుండా నిర్మాతలకు అండగా ఉండాల్సిందే. కాకపోతే.. హీరోలంతా పారితోషికాలు తగ్గించుకోవాలంటూ ఓ జనరల్ స్టేట్మెంట్ ఇవ్వలేం. ఓ సినిమా వల్ల ఇంత రాబడి వస్తుందన్న ప్లానింగ్ తో సినిమా మొదలెడతాం. అంత రాకపోయినప్పుడు, సినిమాకి నష్టాలొస్తున్నాయి అన్నప్పుడు ఆ మేరకు పారితోషికం తగ్గించుకోవడమో, తీసుకున్నది వెనక్కి ఇవ్వడమో చేయాలి. ఓ సినిమా తీసి నిర్మాత మొత్తం పోగొట్టుకున్నాడనిపిస్తే.. జీరో పారితోషికానికైనా సిద్ధ పడాలి. ఈ లెక్క సినిమా సినిమాకీ మారిపోతుంటుంది.
ప్రతినాయకుడిగా తొలిసారి నటించారు. బాగా కష్టపడ్డారా?
అలాంటిదేం లేదు. ఎంజాయ్ చేస్తూనే నటించా. కాకపోతే.. ప్రతీసారీ సెట్లో చాలా పెద్ద డిస్కర్షన్ జరిగేది. ఎలా చేయాలి? ఏం చేయాలి? అనే విషయంపై చర్చించుకునేవాళ్లం. దాంతో అవుట్ పుట్ బాగా వచ్చింది.
మీ సినిమాన్నీ హిందీలో డబ్ అయి మంచి రేటింగులు తెచ్చుకుంటున్నాయి. బాలీవుడ్ లో సినిమా చేసే ఆసక్తి ఏమైనా ఉందా?
నిజానికి అలాంటి ఆలోచన, ఆసక్తీ ఏమీ లేవు. నాకు తెలుగులో చేయడమే కంఫర్ట్ గా ఉంటుంది. కాకపోతే. ఎప్పుడైనా ఓ మంచి కథ వస్తే, సరదగా చేయాలి అనిపిస్తే… అప్పుడు చేస్తా. అంతే.