తెలుగుదేశం పార్టీ ఓటమిలో కీలక పాత్ర… అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చేరిన నేతలదే. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీలో చేరేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇతర నేతలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. కొంత మందిని టీడీపీ నేతలు లాక్కున్నారు. వారి వల్ల అనేక నియోజకవర్గాల్లో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రజల్లోనూ బ్యాడ్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు వైసీపీకి అదే పరిస్థితి ఎదురవుతోంది. వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమాల పేరుతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ రెండు, మూడు వర్గాలు చేసిన హడావుడి.. దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.
వైసీపీలో నేతల మధ్య సఖ్యత తగ్గిపోతోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన నేతల మధ్య … సుదీర్ఘ కాలంగా ఉన్న నేతల మధ్య పొసగడం లేదు. అనేక నియోజకవర్గాల్లో ఒకరి పొడ ఒకరికి గిట్టని పరిస్థితి ఉంది. అలాగే.. చాలా కాలంగా పార్టీలో ఉన్నప్పటికీ..అధికారంలోకి వచ్చినా తమకేమీ దక్కడం లేదన్న ద్వితీయ శ్రేణి నేతల అసంతృప్తి కూడా పెరిగిపోతోంది. ప్రకాశం జిల్లా చీరాల, దర్శి, కృష్ణా జిల్లా గనవరంలలో ఎక్కడికక్కడ గొడవలు జరుగుతున్నాయి. అనేక నియోజవర్గాల్లో వైసీపీ నేతలు.. వేర్వేరుగా వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఈ గొడవలు… పెరిగి పెరిగి.. హైకమాండ్ వద్దకు చేరుతున్నాయి. వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమాల్లో తనను కించ పరిచేలా మాట్లాడాలంటూ.. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. ప్రకాశం జిల్లా వైసీపీ ఇంచార్జ్.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు.
సాధారణంగా అధికారపార్టీలోకి వలసలు ఎక్కువగా ఉంటాయి. అధికారం అడ్వాంటేజ్‌తో పనులు చక్కబెట్టుకోవడానికి ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లిపోతారు కొందరు. అయితే ప్రస్తుతం అలాంటి వారితో పాటు అదిలించి.. బెదిరించి.. మరికొందర్ని పార్టీలో చేర్చుకుంటున్న వైసీపీ నేతలు. అక్కడే సమస్య వస్తోంది..అలా వచ్చిన వారు… అనేక డిమాండ్లు పెడుతున్నారు. అప్పటి వరకూ ఆయా నియోజకవర్గంలో పెత్తనం చేసిన నేతలను తొక్కేస్తున్నారు. దాంతో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడింది తాము అయితే.. అధికారాన్ని అనుభవిస్తోంది టీడీపీ నుంచి నచ్చిన నేతలనే అసంతృప్తి క్యాడర్లో పెరిగిపోతోంది. ఇది ఇంకా పెరిగిపోతే.. వైసీపీకి పూడ్చుకోలేని నష్టం జరుగుతుంది.