కొన్నాళ్ల క్రితం టాలీవుడ్లో డ్రగ్స్ కేసు సునామీ రేపింది. రవితేజ సోదరుడు కారు ప్రమాదంలో చనిపోయినప్పుడు… స్వాధీనం చేసుకున్న ఫోన్ సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులకు లభించిన సమాచారంతో… దాదాపుగా.. టాలీవుడ్ మొత్తాన్ని టార్గెట్ చేశారు. చాలా మంది ప్రముఖుల గోళ్లు.. జుట్టు తీసుకుని పరీక్షలకు పంపారు. అప్పుడు.. ఓ సస్పెన్స్ ధ్రిల్లర్ సినిమా తరహా ఎపిసోడ్లు నడిచాయి. తర్వాత అంతా సైలెంటయిపోయింది. ఇప్పుడు సేమ్ అవే సీన్లు.. కర్ణాటకలో కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట.. బెంగళూరులోని ఓ హోటల్లో పట్టుబడ్డ డ్రగ్స్ డీలర్ నుంచి కూపీలాగిన పోలీసులు.. కేసును శాండల్‌వుడ్ చుట్టూ తిప్పుతున్నారు. ఈ కేసులో ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి.
ప్రముఖ నటి రాగిణి ద్వివేదికి ఈ డ్రగ్స్ బిజినెస్‌లో నేరుగా సంబంధం ఉందన్న ఆధారాలు లభించడంతో పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆమె స్నేహితుడు రవిశంకర్‌ను అరెస్ట్ చేశారు. రాగిణి విచారణకు హాజరు కాలేదు. దీంతో పోలీసులు శుక్రవారం హాజరు కావాల్సిందేనని మో నోటీసు జారీ చేశారు. తనకు ఆరోగ్యం బాగో లేదని ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వెళ్తే అరెస్ట్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో.. లాయర్ ద్వారావిచారణకు హాజరవ్వాలనుకుంటున్నారు. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించిన నటి సంజన గల్రానీ కూడా హాట్ టాపిక్ అవుతున్నారు. ఆమెకు అత్యంత సన్నిహితుడు , రియల్ఎస్టేట్ వ్యాపారి రాహుల్‌ను ఇదే డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
నటీమణులకు సన్నిహితులైన రవిశంకర్, రాహుల్ వద్ద స్వాధీనం చేసుకున్న ఫోన్ల నుంచి కాల్ డేటాను సేకరించిన పోలీసులు… నోటీసులు ఇస్తున్నారు. మరో వైపు.. శాండల్ వుడ్లో విజిల్ బ్లోయర్లు బయటకు వస్తున్నారు. బాలీవుడ్‌తో సంబంధాలున్న ఇంతియాజ్ ఖాత్రిని విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కొంత మంది పోలీసులకు సలహాలిస్తున్నారు. అతని పుట్టినరోజుకు సినీరంగ ప్రముఖులు హాజరవుతుంటారు. అలాగే మరో సినీ ప్రముఖుడు ఇంద్రజిత్ లంకేశ్ తనకు రక్షణ కల్పిస్తే సినిమా రంగానికి చెందిన ముఖ్యల పేర్లను బయటపెడతానని ప్రకటించారు. ఆయన వెళ్లి పోలీసులకు 20పేజీలకుపై సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని.. కర్ణాటక హోంమంత్రి ప్రకటించారు.