తెలంగాణ ప్రభుత్వానికి కరోనా విషయంలో హైకోర్టు నుంచి చీవాట్లు తప్పడం లేదు. కొంత గ్యాప్ వచ్చినా… ఈ సారి కరోనా మరణాలపై ప్రభుత్వ లెక్కలను హైకోర్టు తప్పు పట్టింది. గత విచారణ సందర్భంగా… ఆదేశించినట్లుగా..తెలంగాణ ప్రభుత్వం… ఓ సమగ్ర నివేదికను హైకోర్టుకు సమర్పించింది. అయితే.. నివేదికను పరిశీలించిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేశారు. నివేదికలోని అంశాలన్నీ నిర్లక్ష్యంగా, అస్పష్టంగా ఉన్నాయని మండిపడింది. కరోనా మరణాల విషయంలో… జిల్లాల వారీగా నివేదికలు తెప్పించాలని చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వం కరోనా మృతులపై వాస్తవాలు వెల్లడించలేదనిపిస్తోందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే వైద్యసౌకర్యాల విషయంపైనా కొన్ని సూచనలు చేసింది. గ్రేటర్లో ఐసోలేషన్, కోవిడ్ కేంద్రాల జాబితా ఇవ్వాలని .. జిల్లాల నుంచి కోవిడ్ బాధితులు హైదరాబాద్‌కు వచ్చేలా అంబులెన్సులను పెంచాలని సూచించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే ప్రభుత్వ ల్యాబ్‌ల సంఖ్యను కూడా పెంచాలని సూచించింది. వైద్యారోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్ వివరాలు కూడా హైకోర్టు అడిగింది.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కరోనా వైద్య సేవల విషయంలోనే కాదు.. ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ విషయంలోనూ ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై.. ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని… ప్రైవేట్ ఆస్పత్రులపై విచారణ జరపాలని జాతీయ ఫార్మా ధరల సంస్థను ఆదేశించింది. ఈనెల 22లోగా విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీహెచ్ డైరెక్టర్‌కు స్పష్టం చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగం పడకలు రిజర్వు చేస్తారా లేదా తెలపాలని ఆదేశించింది.