హైదరాబాద్: విజయవాడ నగరంలో రామవరప్పాడు వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణంకోసం రైవస్ కాల్వగట్టుపై ప్రభుత్వం చేపట్టిన ఇళ్ళ తొలగింపు కార్యక్రమం రోజురోజుకూ ముదురుతోంది. నిన్న బాధితులు విజయవాడ-విశాఖ రహదారిపై రాస్తారోకోతో ఆందోళనకు దిగటం, వారికి స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వల్లభనేని వంశీ మద్దతు పలకటం తెలిసిందే. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా బాధితులకు మద్దతు పలికారు. ఆయన ఇవాళ విజయవాడ చేరుకుని బాధితులను పరామర్శించారు. పెద్దవారికోసం అలైన్మెంట్లు మార్చి పేదల ఇళ్ళు తొలగిస్తున్నారని ఆరోపించారు. పరిహారం ఇవ్వకుండా 500 ఇళ్ళు కూల్చాలనుకోవటం దారుణమని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు పేదలపట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పేదలకు అండగా నిలబడుతుందని అన్నారు. బాధితుల తరపున కోర్టుకు వెళతామని చెప్పారు. జగన్ వెంట వైసీపీ నాయకులు కొడాలి నాని, పార్థ సారథి ఉన్నారు. దేవినేని నెహ్రూకు చెందిన ఆస్తులను కాపాడటంకోసమే అధికారులు ఎలైన్మెంట్ మార్చి పేదల ఇళ్ళు తొలగిస్తున్నారని వల్లభనేని వంశీ నిన్న ఆరోపించగా, తెలుగుదేశం కార్పొరేటర్‌కు చెందిన హోటల్ కోసం ఎలైన్మెంట్ మారుస్తున్నారని జగన్ ఇవాళ ఆరోపించటం విశేషం.