తెలంగాణ పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ గురించి ఓ పాఠం పెట్టారు. పదోతరగతి సాంఘిక శాస్త్రంలో పేజీ నంబర్ 268లో ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్‌లోనూ ఆ పాఠం ఉంది. ఎన్టీఆర్ ఎదిగిన వైనాన్ని నాలుగు ప్రధానాంశాల్లో చెప్పారు. సినీ హీరోగా విజయాలు.. రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాటం..పేదలకు జనాకర్షక పథకాలు, ఇతర ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు వంటి వాటిని వివరించారు. గత మూడు నాలుగు రోజులుగా… పదో తరగతి పుస్తకంలో ఎన్టీఆర్ పాఠాలు..సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా కేసీఆర్ ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఒక నటుడిగా జీవితం మొదలు పెట్టి, రాష్ట్రానికి సీఎం అయ్యి రూ.2 కిలో బియ్యం, మద్యపాన నిషేధం వంటి పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపియారు. దాంతో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా మారిస్తే ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటుందన్న ఉద్దేశంతో పాఠాన్ని పెట్టినట్లుగా తెలుస్తోంది. నందమూరి తారకరామారావు తనయుడు బాలకృష్ణకు కూడా ఈ పాఠ్యాంశం గురించిన సమాచారం తెలిసింది. దీంతో ఆయన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తన తండ్రి జీవితాన్ని భవిష్యత్తు తరాలకు తెలిపేలా పాఠ్య పుస్తకాల్లో ప్రచురించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
‘కళకి, కళాకారులకి విలువ పెంచిన కథానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని దిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మద్రాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ మా నాన్నగారు నందమూరి తారక రామారావు. భవిష్యత్తు తరాలకి స్ఫూర్తినిచ్చేలా ఆయన గురించి 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని బాలయ్య తన పోస్ట్‌లో ప్రశంసించారు.
యువజన కాంగ్రెస్‌లో నేతగా ఎదిగినా ..కేసీఆర్… ప్రజాప్రతినిధిగా.. టీడీపీలోనే ఎదిగారు. ఆయన ఎన్టీఆర్ ను ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. ఒక్క మగాడని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతారు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా.. బీసీలకు రాజకీయంగా పదవులు ఇచ్చింది ఎన్టీఆరేనని చెబుతూ ఉంటారు. పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ పాఠం ఉండటం.. కేసీఆర్ కు తెలిసి జరిగిందో .. తెలియకుండానే సంబంధిత విభాగం నిర్ణయం తీసుకుందో కానీ.. ప్రశంసలు మాత్రం…ఆయనకే దక్కుతున్నాయి.