బిగ్‌బాస్ ఫేం నూతన్ నాయుడు …పీవీ రమేష్ ఫోన్ నెంబర్‌ను ఉపయోగించుకుని చేసిన దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తమకు ఫేక్ కాల్స్ చేశారంటూ… విశాఖ జిల్లాలో మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తన పేరుతో ఉన్న ఫోన్ నెంబర్‌ను వాడుకుని నూతన్ నాయుడు మోసాలు చేశాడని తెలియడంతో… మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అవాక్కయ్యారు. తన పేరుతో అధికారులకు నూతన్ నాయుడు ఫోన్ చేసి.. బెదిరించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ట్విట్టర్లో పేర్కొన్నారు.
అధికారుల నుంచి నగదు, ఇతర సహాయాలు పొందేందుకు నూతన్ నాయుడు ప్రయత్నం చేశారని .. ఇది తీవ్రమైన నేరమన్నారు. కేవలం మోసం చేయడానికి ప్రయత్నించడమే కాదని… తన నిజాయితీకి భంగం కలిగించే ప్రయత్నం చేశారని విమర్శించారు. తన పేరుతో ఎవరైనా ఫోన్ చేసి.. డబ్బులు లేదా ఇతర ఫేవర్స్ చేయమని అడిగితే తక్షణం పోలీసులకు ఫోన్ చేయాలని పీవీ రమేష్ కోరారు. ప్రస్తుతం పీవీ రమేష్..ఐఏఎస్‌గా రిటైరైనప్పటికీ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు.
అయితే ఆయనకు సబ్జెక్టులేమీ లేవు. మొదట్లో సీఎంవోలో కీలక పాత్ర పోషించిన ఆయనను తర్వాత సైడ్ చేశారు. ఇప్పుడు పనేమీ లేకపోవడంతో.. ఆయన అధికార కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. కోవిడ్ నివారణ చర్యల్లో ప్రభుత్వం తరపున మొదట్లో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత జవహర్ రెడ్డి.. ఆ పాత్రలోకి వచ్చారు. పీవీరమేష్ ప్రాధాన్యం తగ్గించారు.