ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యుత్ మీటర్ల టెన్షన్ ప్రారంభమయింది. రైతుల్లో కనిపిస్తున్న వ్యతిరేకతే దీనికి కారణం. అవసరం లేకపోయినా విద్యుత్ మీటర్లు పెడుతున్నారన్న అభిప్రాయం.. రైతుల్లో ఏర్పడుతోంది. కేంద్రం.. ఖచ్చితంగా మీటర్లు పెట్టాలని చెప్పలేదని తెలుగుదేశం పార్టీ సహా.. రైతు సంఘాలు… విపక్ష నేతలు.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే రైతుల్లోకి వెళ్తోంది. విద్యుత్ మీటర్లు పెడితే.. లేనిపోని సమస్యలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరికి మూడు నాలుగు చోట్ల పొలాలుండటం… అన్నింటికీ విద్యుత్ కనెక్షన్లు ఉండటం దగ్గర్నుంచి అనేకానేక సమస్యలు మీటర్ల ఏర్పాటులో వస్తాయి.
ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు విషయంలో పెడుతున్న నిబంధనలు అన్నీ ఇన్నీ కావు. లబ్దిదారులను ఎలిమినేట్ చేసేందుకు పెడుతున్నారని సులువుగానే అర్థమయిపోతుంది. రేపు రైతులకు కరెంట్ మీటర్లు పెట్టిన తర్వాత.. ఉచిత విద్యుత్ కు అర్హులు కాదు అని చెబితే… తమ పరిస్థితేమిటని… వారు భయపడుతున్నారు. వారి భయాలను వైసీపీ నేతలు సులువుగానే అర్థం చేసుకున్నారు. అందుకే.. ప్రభుత్వం కూడా.. అప్రమత్తమయింది. ప్రతీ రోజూ… పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తోంది. తమ తమ అనుకూల మీడియాలో… రైతులకు ఎప్పటికీ ఉచిత విద్యుత్ అని చెప్పేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వంలోని ముఖ్య నేతలంతా వరుసగా మీడియా ముందుకు వచ్చి.. రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ రైతుల్లో ఒక్క సారి ఆందోళన పెరిగితే.. అదుపు చేయడం కష్టమవుతుంది. ఈ విషయం.. వైసీపీ నేతలకు తెలియనిదేం కాదు. అందుకే.. వారిలో.. ఆందోళనలు తగ్గించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. ప్రభుత్వం, నేతలు చేస్తున్న ప్రకటనలు గందరగోళంగా ఉండటం…ఉచిత విద్యుత్ ఇస్తున్న మరే ఇతర రాష్ట్రమూ.. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడతామని.. కేంద్రానికి కమిట్ కాకపోవడంతో.. రైతుల్లో అనుమానాలు బలపడుతున్నాయి. ఇది ఏపీ ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.