ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు ఈ ఘనత ఎవరిదన్నదే చర్చనీయాంశమైంది. క్రెడిట్ తమదంటే.. తమదని.. టీడీపీ, వైసీపీలు ప్రకటించుకుంటున్నాయి. 2019 నాటికి ఉన్న అనుమతులు, ప్రక్రియలు, పారిశ్రామికవేత్తల ఫీడ్ బ్యాక్ ను పరిగణనలోకి తీసుకొని అంచనా వేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు తొలి ర్యాంక్ లభించింది. ఈ విషయాన్ని ఢిల్లీలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వెంటనే ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రి గౌతం రెడ్డి స్పందించారు. ఇది తమ ఘనతగా .. జగన్మోహన్ రెడ్డి విజన్‌కు ఫలితంగా చెబుతూ.. పరిశ్రమల శాఖ మంత్రి కార్యాలయం, పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి కార్యాలయం ఒక అడుగు ముందుకేసి గతంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నుంచి మంత్రి గౌతమ్ రెడ్డి అవార్డు తీసుకుంటున్న ఒక ఫైల్ ఫొటోను కూడా మీడియాకు పంపించారు. అప్పుడే పతకం అందుకున్నట్లుగా కవరింగ్ చేశారు.
అయితే.. తెలుగు దేశం పార్టీ నేతలు వెంటనే తెర మీదకు వచ్చారు. వైసీపీ ప్రభుత్వం 2019 మే 30వ తేదీన అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు తీసుకున్న చర్యల గురించి అవార్డు వచ్చిందని చెప్పడం ప్రారంభించారు. ర్యాంకింగ్ లు విడుదల చేసిన సమయంలో ప్రకటించిన మెథడాలజీని కూడా నారా లోకేష్ తన ట్విట్టర్ లో పొందుపరిచారు. ఫస్ట్ ర్యాంక్ చంద్రబాబు కృషికి నిదర్శనమన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణలను జగన్ కొనసాగించి ఉంటే బాగుండేదని, కానీ ఆయన పారిశ్రామిక విధానాన్ని భ్రష్టుపట్టించారని విమర్శించారు. చంద్రబాబు అవలంభించిన విధానాలను ప్రస్తుత ప్రభుత్వం అనుసరించాలని, ఆ అడుగుజాడల్లో నడిస్తే రాష్ట్రం ముందడుగు వేస్తుందని కుటుంబరావు కూడా సలహా ఇచ్చారు.
అయితే ఈ ర్యాంకులపై గతంలో… జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి. ఈ ర్యాంకులేమీటో తనకు అర్థం కావడం లేదని. .. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుందని.. తీసిపడేశారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతే కాదు.. మూడో కేబినెట్ సమావేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒక పనికిమాలిందని చెప్పారన్న ప్రచారం జరిగింది. ఈ మాటలను గుర్తు చేస్తున్న సోషల్ మీడియా… అలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు ర్యాంకుల గురించి ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇది వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.