నాని పడిలేచిన కెరటం. హ్యాట్రిక్ ఫ్లాపులు వున్నాయి ఖాతాలో. ఆహా నా కల్యాణం, జెండాపై కపిరాజు, పైసా .. ఇలా ప్రేక్షకుల మెమోరీ నుండి డిలీట్ అయిపోయిన సినిమాలు వున్నాయి. ఒక దశలో కొత్త సినిమా సైన్ చేయడానికి కూడా ఇష్టపడలేదు నాని. చాలా కసరత్తులు చేసి తన బలం ఏంటో తెలుసుకొని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో మళ్ళీ గాడిలో పడ్డాడు. తర్వాత హ్యాట్రిక్ విజయాలు వచ్చాయి. మొన్నామధ్య వచ్చిన ‘జెర్సీ’ అయితే నాని అభిమానులే కాదు ఇండస్ట్రీ గౌరవం కూడా దక్కించుకుంది. ఇలాంటి నేపధ్యంలో నాని మరింత స్ట్రాంగ్ గా భవిష్యత్ ని నిర్మించుకొవాలి. కానీ నాని మళ్ళీ గాడి తప్పినట్లు కనిపిస్తున్నారు. నాని గ్యాంగ్ లీడర్, అంతకుముందు వచ్చిన, కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాల ఎంపిక చూస్తుంటే మళ్ళీ ఎక్కడో లెక్కలు తప్పినట్లనిపిస్తుంది. అయితే ఈ మూడు సినిమాల్లో నాని పాత్ర, నటన పై ఎక్కడ విమర్శలు రాలేదు. బాక్సాఫీసు దగ్గర సరిగ్గా రాణించలేదనే మాట తప్పితే నాని బాగానే చేశాడని మాట వినిపించింది.
కానీ లేటెస్ట్ ‘వి’ చూసిన ప్రేక్షకులు.. నానికి ఏమయింది ? అనే ప్రశ్న వేసుకుంటున్నారు. కధల ఎంపిక పై ఎంతో తెలివిగా వ్యవహరించే నాని.. ఇలాంటి కధకు , తన పరిధి కానీ పాత్రకు ఎలా అంగీకరించారనేది వారి ప్రశ్న. నిజమే.. ఈ సినిమా చూసిన ఎవరికైనా ఇదే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. ”నాని.. నీవు ఆర్మీ ఆఫీసర్ వి, క్లైమక్స్ లో ఒక్కడివే ఒక యాబై మంది ని చంపెస్తావ్” ఈ మాట దర్శకుడు చెప్పినప్పుడే ..”మరో కధ చెప్పండి సర్’ అని నాని అనాల్సింది. నో చెప్పడానికి మొహమాట పడ్డాడా? ఆర్మీ సోల్జర్ అంతమందిని చంపేయగలడనే లాజిక్ కి కన్విన్స్ అయిపోయాడో తెలియదు కానీ విరాట్ కోహ్లి క్రికెట్ కాకుండా వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించాడానికి పూనకున్నట్లు, అనవసరమైన బరువుని సినిమా అంతా మోసాడు. ఇంత బరువు మోసినప్పటికీ.. లాభం లేకపోయింది. నాని నటన పాకం తప్పిన స్వీట్ లా అనిపించింది. మొదటి సీన్ నుండే పాత్ర తేలిపోయిన ఫీలింగ్.
రివెంజ్ సినిమాలు కొత్తకావు. పాత కావు. రివెంజ్ ఫార్ములతో క్లాసిక్స్ వున్నాయి. భవిష్యత్ లో ఇంకా వస్తాయి కూడా. రివెంజ్ ని ఎలా చూపించామన్న పాయింట్ పై విజయం ఆధారపడి వుంటుంది. దర్శకుడు నానికి ఏం చెప్పాడో పక్కన పెడదాం.. తన పాత్ర వరకూ నాని ఏం చేశాడు? భార్యని పోగొట్టుకున్న భర్త ఎంత ఇంటెన్సిసిటీతో వుండాలి? అందులోనూ అతడొక ఆర్మీ ఆఫీసర్.. తన రివెంజ్ ని ఏ స్థాయిలో ప్లాన్ చేయాలి ? తన ప్రతి కదలిక ఎంత ఇంటెల్జెంట్ గా వుండాలి ? ఈ ప్రశ్నలు నాని వేసుకొని దర్శకుడిని అడగాల్సింది. కానీ ఇలాంటి గ్రౌండ్ వర్క్ ఏమీ చేయకుండా.. సెట్స్ లోకి వెళ్లి ఆ పుటకి డైలాగులు చెప్పి వచ్చేసినట్లువుంది నాని పాత్ర. నాని సినిమా అంటే కనీసం ఒక్క సీన్ లోనైనా మెరుపులాంటి నటన కనిపిస్తుంటుంది. కానీ ‘వి’ లో ఆ మెరపు కనిపించలేదు.
నిజానికి ఒక కధ అనుకున్నప్పుడు అది ఎంత జెన్యూనో.. నాని లాంటి నటుడు తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ‘వి’ కధా బీజంలోనే అతి పెద్ద దోషం వుంది. నాని పాత్ర, సుదీర్ బాబు పాత్రకి ఛాలెంజ్ విసురుతుంది. ఈ ఛాలెంజ్ ఎందుకంటే .. సుదీర్ బాబు బిల్డప్ పోలీసనే అనుమానం నాని పాత్రకి వస్తుంది. ఆ అనుమానంతోనే తన రివెంజ్ లో బాగంగా హ్యతలు చేసి .. ‘దమ్ముంటే ఆపు’ అని ఛాలెంజ్ చేస్తుంటాడు నాని. ఆ ఛాలెంజలతోనే సినిమా పూర్తవుతుంది. చివర్లో.. ”నేను మంచోడి కదా.. నన్ను ఎందుకు ఛాలెంజ్ చేసావ్ ? అని అమాయకంగా అంటాడు సుదీర్ బాబు. ఆ ప్రశ్నకు ”నీ మీద నాకు డౌట్” అని సమాధానం చెప్తాడు నాని. ఈ సినిమాలో వున్న ఏకైక కామెడీ సీన్ ఇదే. ఆరు నెలలు రెక్కి నిర్వహించి మర్డర్లు ప్లాన్ చేసిన నాని పాత్ర.. ఈ ఆరు నెలల్లో సుదీర్ బాబు పాత్ర ఎలాంటిదో తెలుసుకోలేకపోయాడంటే.. కితకితలు పెట్టుకొని మరీ నవ్వుకోవాలి. స్క్రిప్ట్ ఎంత వీక్ గా వుందో కధకు మూలమైన ఈ ఒక్క పాయింట్ చెబుతుంది. ఇంత వీక్ స్క్రిప్ట్ కి నాని ఓకే చెప్పడం ఇంకా ఆశ్చర్యం.
ఇంద్రగంటి టేస్ట్ పై నమ్మకమో.. దిల్ రాజు గారి సినిమా అంటే మినిమం గ్యారెంటి అనే భరోసా ఏమిటో తెలియదు కానీ నాని మాత్రం తనపాత్రపై కానీ కధపై కానీ పెద్దగా వర్క్ చేసినట్లు అనబడలేదు. ఇలాంటి వీక్ స్క్రిప్ట్ మరో హీరో చేస్తే ఇంత చర్చ రాదు. కానీ నాని సహజ నటుడు. నాని నుండి ఒక సినిమా వస్తుందంటే అటు మాస్ ఇటు క్లాస్ ఇరు ప్రేక్షకులు వినోదం కోసం ఎదురుచూస్తుంటారు. నాని కూడా అంచనాలకు తగ్గట్టు కధ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ వి విషయంలో మాత్రం అభిమానులని చాలా నిరాశ పరిచాడనే భావన వ్యక్తం అవుతుంది.
అయితే నానికి అపజయాలు కొత్త కాదు.. అపజయం వచ్చిన ప్రతిసారి తప్పుల్ని దిద్దుకొని కధల ఎంపికపై మరింత జాగ్రతలు పాటిస్తూ విజయం వైపు అడుగులు వేశాడు నాని. ఈసారి ‘వి’ ఫర్ విమర్శలని చక్కదిద్దుకొని.. వెంటనే మరో సినిమాతో వి ఫర్ విజయం సాధించాలనే భావిద్దాం.