ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లే చర్యల్లో భాగంగా.. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. కానీ ఇందులో సేవలకు ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. అది కూడా.. కొంచెం కాదు… గతంలో ఈ సేవలు పొందడానికి అయ్యే ఖర్చు కన్నా.. మూడింతలు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవా కేంద్రాలు ఉండేవి. అందులో ప్రభుత్వానికి సంబంధించిన ప్రాథమిక సేవలు లభించేవి. కుల, ఆదాయ ధృవీకరణ… జనన, మరణ ధృవీకరణ పత్రాలు.. ప్రభుత్వానికి చెందిన కొన్ని పథకాలకు దరఖాస్తు చేసుకోవడం వంటివి చేసుకునేవారు. వాటికి చాలా పరిమితంగా… పది.. పదిహేను రూపాయలు వసూలు చేసేవారు. ఇప్పుడు.. ఈ-సేవలకు కేటాయించిన విధులన్నింటినీ గ్రామ, వార్డు సచివాలయాలకు బదలీ చేశారు.
అక్కడ ఉచితంగా అందిస్తారని ప్రజలకు అనుకున్నారు కానీ.. ఈ సేవలో వసూలు చేసే దాని కన్నా ఎక్కువగా… వసూలు చేస్తున్నారు. రూ. 15 చెల్లించి పొందగలిగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఖర్చును రూ. 45కి పెంచారు. కొత్త పాస్బుక్ పదిహేను రూపాయలకు ఇవ్వాల్సి ఉంటే.. ప్రింటింగ్ చార్జీలంటూ.. కొత్త మెలిక పెట్టి దాన్ని 145కి తీసుకెళ్లారు. ఈ-సేవ కేంద్రాలు… ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సేవలు పరిమితంగా ప్రైవేటు వ్యక్తులు అందించేలా చేసిన ఏర్పాట్లు. అక్కడ యూజర్ చార్జీలు తీసుకోవడం… సహజమే. కానీ.. గ్రామ, వార్డు సచివాలయాలు.. పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులతో నిండి ఉన్న వ్యవస్థ. ప్రజాధనంతోనే వాటిని నిర్వహిస్తారు. ఉద్యోగులకు జీతాలిస్తారు.
అలాంటప్పుడు.. సర్వీస్ చార్జీలు ఎందుకన్న చర్చ మొదట్లోనే నడిచింది. అయితే.. ప్రభుత్వం అదేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు… ప్రైవేటు సర్వీసుల్లో తీసుకునే యూజర్ చార్జీల కన్నా.. రెండింతలు, మూడింతలు యూజర్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది పేదలకు భారంగా మారనుంది. కొత్త వ్యవస్థ వల్ల.. ఈసేవలో అందుతున్న సేవలు తప్ప.. కొత్తవేమీ దొరకడం లేదని.. పథకాలు.., సమస్యల కోసం వెళ్లి దరఖాస్తు చేసుకోవడమే కానీ.. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా సేవలు అందడం లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఇప్పుడు చార్జీలు పెంచడంతో… ప్రజలు మరింత ఇబ్బంది పడనున్నారు.