తెలంగాణలో ప్రతిపక్షాల మధ్య పోటీ కనిపిస్తోంది. అధికార పార్టీపై పోరాటానికి తామంటే తాము ముందున్నామని చెప్పుకునేందుకు రోడ్డెక్కుతున్నారు. అయితే.. ఇక్కడ కాంగ్రెస్.. భారతీయ జనతా పార్టీ దృక్కోణాలు వేర్వేరు. కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క… ప్రభుత్వంపై కరోనా విషయంలో పోరాడుతున్నారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం విఫలం అయిందని.. పెద్ద ఎత్తున ప్రాణాలు పోవడానికి కారణం కేసీఆరేనని ఆరోపిస్తూ.. రోడ్డెక్కారు. ఆయన పీపీఈ కిట్లు ధరించి మరీ.. తెలంగాణలో జిల్లాల యాత్ర చేశారు. హాస్పిటల్స్‌ను సందర్శించారు. ప్రభుత్వం తీరును ప్రజల్లో చర్చకు పెట్టే ప్రయత్నం చేశారు.
మల్లు భట్టివిక్రమార్కకు.., పార్టీ నుంచి సహకారం అందిందా లేదా అన్నది తర్వాతి విషయం కానీ ఆయన మాత్రం.. పట్టు వదలని విక్రమార్కుడిగా… తన వెంట అతి కొద్ది మందే ఉన్నప్పటికీ.. యాత్ర మాత్రం పూర్తి చేశారు. ఇప్పుడు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు… బండి సంజయ్ యాత్రను టేకప్ చేశారు. ఆయితే ఆయన.. దృక్కోణం..బీజేపీ స్టైల్లోనే ఉంది. ఆయన ప్రజా సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో కాకుండా.. భిన్నమైన అంశాన్ని ఎత్తుకున్నారు. రజాకార్ల అరాచకాలు, అకృత్యాలకు గురైన స్థలాలను ఆయన జిల్లాల పర్యటనలో సందర్శిస్తారు. రోజుకు మూడు జిల్లాల్లో పర్యటన సాగనుంది. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మొదటగా యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్తారు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లా .. వరంగల్ రూరల్ జిల్లా… గోదావరిఖనిలో ..కొమురంభీం అసిఫాబాద్ జిల్లా నిజామాబాద్ లలో పర్యటిస్తారు.
బండి సంజయ్ జిల్లాల యాత్ర ప్రజా సమస్యలను గుర్తించడానికి చేస్తూ ఉంటే బాగుండేదన్న సూచనలు సహజంగానే రాజకీయంలో వినిపిస్తాయి. కొత్తగాబీజేపీ తెలంగాణ అధ్యక్షుడు అయిన బండి సంజయ్.. తన మొదటి యాత్రను.. ఇలా రజాకార్ల ఆకృత్యాల పేరుతో చేయడం… రాజకీయంగా లాభమేనా అన్న చర్చ ఆ పార్టీలో నడుస్తోంది. ఎవరికి ఏది లాభమో అదే చేస్తారు… బహుశా… దీని వెనుక బండి సంజయ్ భారీ వ్యూహం పెట్టుకున్నారేమోనని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు.