తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున రెవిన్యూ సంస్కరణలకు రంగం సిద్ధం అయింది. మంగళవారం నుంచి తెలంగాణలో ఒక్కటంటే.. ఒక్క రిజిస్ట్రేషన్ జరగకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా …వీఆర్వోల వద్ద ఉన్న రికార్డులు మొత్తం స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో… ఈ-స్టాంపుల విక్రయాన్ని అధికారులు ఆపేశారు. చలానాలు చెల్లించిన వారికి మాత్రం ఇవాళ రిజిస్ట్రేషన్లు చేయించుకునే అవకాశం కల్పించారు. కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకు రావాలని తెలంగాణ సర్కార్ చాలా కాలంగా పట్టుదలతో ఉంది. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.
ఈ సారి మాత్రం… చట్టాన్ని ఆమోదించి.. వెంటనే అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో… ఆమోదించబోయే బిల్లులో విఆర్వోల వ్యవస్థను రద్దు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే వారి వద్ద ఉన్న రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నారని అంటున్నారు. అలాగే.. రిజిస్ట్రేషన్లు కూడా.. ఇక ప్రత్యేకంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కాకుండా.. నేరుగా మండల పరిధిలో.. ఎమ్మార్వో దగ్గరే పూర్తి చేయాలనుకుంటున్నారు.
ఎలాంటి అవకతవకలకు చాన్స్ లేకుండా నిబంధనలు ఉంటాయని చెబుతున్నారు. రెవిన్యూవ్యవస్థలో అవినీతి పేరుకు పోయిందని… అసలు ఆ వ్యవస్థనే రద్దు చేయాలని కేసీఆర్ భావించారు. బహుశా… కొత్తచట్టంలో అలాంటి విప్లవాత్మక మార్పులు ఉండవచ్చని… తక్షణం రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం.. వీఆర్వోల వద్దనున్న రికార్డులు స్వాధీనం చేసుకోవడంతోనే తేలిపోతోందన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.