కరోనా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా నమోదైన పాజిటివ్‌లతో కలిసి మొత్తం కేసులు ఐదు లక్షలు దాటిపోయాయి. మొత్తం కరోనా మృతుల సంఖ్య 4 వేల 487కు చేరింది. ఇటీవలి కాలంలో వైరస్ విజృంభిస్తోంది. గత 10 రోజుల్లోనే లక్షా 13 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. పాజిటివ్‌లతో పాటు మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. పాజిటివిటీ రేటుతో పాటు యాక్టివ్ కేసుల్లో ఏపీ ముందు ఉంది. దేశీయంగా ప్రతి వంద యాక్టివ్ కేసుల్లో 10 మంది ఆంధ్రులే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వంద మంది కరోనా బాధితుల్లో ఒక ఆంధ్రుడు ఉన్నారు.
కరోనా వైరస్ మొదట్లో ఏపీలో అంతగా ప్రభావం చూపలేదు. మెట్రో సిటీలు ఉన్న రాష్ట్రాల్లో మాత్రం… ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత కట్టుదిట్టంగా వైరస్ కట్టడి చర్యలు తీసుకోవడంతో.. ఆయా రాష్ట్రాలు బయటపడుతున్నాయి. ఏపీలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. రోజుకు సగటున 8వేల మంది డిశ్చార్జ్ అవుతున్నా .. కొత్త కేసులు అంత కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏపీలో నగరాలు, పట్టణాలు దాటి కరోనా పల్లెలకు విస్తరించింది. సరైన అవగాహన లేక పల్లెవాసులు వైరస్ బాధితులు అవుతున్నారు. పల్లెల్లో మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విస్తరించిన తర్వాతే పాజిటివ్‌ల రేటు పెరుగుతోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..కరోనా అందరికీ వస్తుందన్న పాలసీని పాటిస్తున్నారు. కేసులు పెరిగిపోతున్నా.. అదే పద్దతి. ఇప్పుడు అసలు కట్టడి చర్యలు దాదాపుగా లేవన్న అభిప్రాయం ఏర్పడిపోయింది. కరోనా దానంతటకు అది తగ్గితే సరి.. లేకపోతే లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.