గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. ఓ వైపు దుట్టా రామచంద్రరావు..మరో వైపు యార్లగడ్డ వెంకట్రావు .. గన్నవరంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ వైసీపీ కోసం కష్టపడిన వాళ్లే. పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నవాళ్లే. అయితే.. అనూహ్యంగా వైసీపీలోకి వల్లభనేని వంశీ వచ్చి చేరడంతో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు వంశీ.. గన్నవరం నియోజకవర్గానికి తానే ఇన్చార్జినని…తానే ఎమ్మెల్యేనని స్వయంగా ప్రకటించుకోవాల్సి వస్తోంది. ప్రెస్మీట్లు పెట్టి.. జగన్ను పొగుడుతూ..చంద్రబాబును విమర్శిస్తూ…పనిలో పనిగా…గన్నవరంపై తనదే పట్టు అని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారు. తాజాగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టే అంశంపై ప్రభుత్వాన్ని సమర్థించేందుకు ప్రెస్మీట్ పెట్టి..గన్నవరం వైసీపీకి తానే నాయకుడ్నని ప్రకటించేసుకున్నారు.
రాష్ట్రంలో వైసీపీకి జగన్ ఒక్కరే నాయకుడని, గన్నవరంలో కూడా ఒకరే నాయకుడని .. తనను జగన్తో పోల్చేసుకున్నారు. గన్నవరం నాయకత్వం తీసేసుకున్నానని.. అందరిని కలుపుకుని వెళ్తానని చెప్పుకొచ్చారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళడానికి నేను సిద్ధమని.. కానీ ఇప్పడు ఆ పరిస్థితి లేదని చెప్పుకొస్తున్నారు. దుట్టా, యార్లగడ్డ వర్గాలను కలుపుకుని వెళ్లే అనుభవం తనకు ఉందని… కానీ ప్రస్తుతం… అలాంటి పరిస్థితి లేదన్నారు. తన ప్రత్యర్థులు ఇద్దరూ ప్రజా జీవితంలో లేరని చెప్పేందుకు ఆయన ప్రాథాన్నయం ఇస్తున్నారు. ప్రజా జీవితంలో లేని వారి వల్ల వైసీపీకి, నాకు ఏమి నష్టం జరుగుతుందని తేలిగ్గా తీసుకున్నారు.
తాను వైసీపీలోకి వెళ్ళాను కాబట్టి కొంత తగ్గాల్సి వస్తుందన్నారు. అందులో తప్పు లేదని సమర్థించుకున్నారు. గన్నవరంలో…దుట్టా, యార్లగడ్డ వర్గాలు చెలరేగిపోవడానికి.. హైకమాండ్ ఆశీస్సులే కారణమన్న ప్రచారం ఓ వైపు జరుగుతోంది.మరో వైపు వంశీ మాత్రం..తాను నాయకత్వం తీసేసుకున్నానని.. వైసీపీ జగన్ ఎలాగో… గన్నవరానికి తాను అలా చెప్పుకుంటున్నారు. ఎలా చూసినా.. వంశీ మాత్రం ఒత్తిడిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.