జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారని దాని పేరు “నయా భారత్” అంటూ జరుగుతున్న ప్రచారంపై..పార్టీ నేతలకు కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. జాతీయ పార్టీ పెడుతున్నట్లు పత్రికల్లో వార్తలొస్తున్నాయిని.. ఎవరూ కన్ఫ్యూజ్ కావొద్దు.. వాటిపై స్పందించొద్దని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. ఆ తర్వాత పార్టీ నేతలతో తాజా రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. జాతీయ పార్టీ అంశాన్ని ప్రస్తావించారు. పార్టీ పెట్టే ఆలోచన ఉంటే.. బాజాప్తగా చెప్పే పెడుతామన్నారు.
మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా నయా భారత్, గియా భారత్ ఏదీ లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలు బయట ఎక్కడా దీని గురించి మాట్లాడవద్దని.. స్పష్టం చేశారు. అంటే..మీడియాలో జరుగుతున్న ప్రచారంపై..టీఆర్ఎస్ వైపు నుంచి అధికారిక స్పందన ఏదీ రాదన్నమాట. మామూలుగా కేసీఆర్ తాను తీసుకుంటున్న నిర్ణయాలను సీక్రెట్ గానే ఉంచుతారు. మీడియాలో ప్రచారమయ్యేలా చూసుకుని…ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసుకుంటారని చెబుతున్నారు.
ఈ క్రమంలో… గతంలోలా… సీక్రెట్ గా నిర్ణయం తీసుకున్నారేమోనని ఎమ్మెల్యేలు కూడా నమ్ముతారన్న ఉద్దేశం ఏమో కానీ… అందరితో చర్చిస్తానని కూడా ప్రకటించారు. జాతీయ రాజకీయాలకు వెళ్లాల్సిన సమయం ఇంకా ఉందన్నారు. కేసీఆర్ మాటలను బట్టి…ఇప్పటికైతే… జాతీయ రాజకీయాలపై అంతర్గత కసరత్తే కానీ…ఇప్పుడే తెర మీదకు తెచ్చే ఉద్దేశం లేదన్న అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది.