అమరావతి రైతులు ఇచ్చిన భూముల్ని ఇళ్ల పట్టాలుగా ఇవ్వనివ్వకుండా కోర్టుకెళ్లారు కాబట్టి.. అమరావతిని శాసనరాజధానిగా కూడా ఉంచవద్దనే ఆలోచన ప్రభుత్వ పెద్దల్లో ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి ఆలోచనలు… అనుకూలురైన నేతలతో మాట్లాడించి.. ఆ దిశగా ఆలోచిస్తున్నామనే ప్రకటనలు చేసి… ముందుకెళ్లడం ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పని. ఇందులో భాగంగా.. మంత్రి కొడాలి నాని.. అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని.. ముఖ్యమంత్రికి చెప్పారట. ఆయన కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చెప్పారట. అంటే.. శాసన రాజధానినికూడా అమరావతి నుంచి తరలించడానికి ఓ ప్రణాళిక ప్రకారం.. ప్రక్రియ ప్రారంభించారన్న చర్చ ప్రారంభమయింది.
అమరావతిలో శాసన రాజధాని ఉన్నా… ఏడాదిలో మూడు సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాలను ఓసారి విశాఖలోనే నిర్వహించాలని చట్టంలో పేర్కొన్నారు. రెండు సార్లు నిర్వహించే సమావేశాలకు అధికారయంత్రాంగం మొత్తం విశాఖ నుంచి తరలి రావాల్సి ఉంటుంది. ఇది సాధ్యం కాదని… అసలు అమరావతిలో ఏ రాజధాని ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు.. దానిపై ముఖ్యమంత్రి చెప్పారంటున్న… “చర్చించి నిర్ణయం” ప్రకటనతో.. క్లారిటీ వస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
రాజధానిలో ఇళ్ల స్థలాల పంపిణీకి అనుమతించకపోతే.. శాసన రాజధానిని కూడా తరలిస్తామన్న బ్లాక్‌మెయిలింగ్.. కొడాలి నాని వ్యాఖ్యల్లో ఉందని అమరావతి రైతులు అంటున్నారు. కేవలం తమను బెదిరించి లొంగ దీసుకోవడానికి ఎత్తు వేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఈ విషయంలో తాము రాజీపడబోమని.. శాసన రాజధాని ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనని… ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని ఉండి తీరాల్సిందేనని… వారు అంటున్నారు. ఒక్కటి అయితే నిజం.. కొడాలి వ్యాఖ్యలు యాధృచ్చికం కాదు.. ఖచ్చితంగా ఓ ప్రణాళిక ప్రకారం ప్రారంభమైన వ్యవహారం అని.. వైసీపీలో విధాన నిర్ణయాలు అమలు చేసేందుకు నిర్వహించే ప్రక్రియపై అవగాహన ఉన్న వారు అంటున్నారు.