తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తోంది. అందులో భాగంగానే రెవెన్యూ శాఖలో కీలకమైన వీఆర్వోల వ్యవస్థను సర్కార్ రద్దు చేసింది. అటు రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఆ శాఖకు సెలవులు ఇచ్చేశారు. రెవెన్యూ వ్యవస్థలో అవినీతిపై ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వీఆర్వోలు, తహశీల్దార్ లక్షలు, కోట్ల రూపాయల లంచాలు తీసుకుంటూ దొరుకుతుండటంతో ఆ వ్యవస్థపై ప్రజల్లో ఆగ్రహం ఉంది. గతంలో ధరణి వెబ్సైట్, రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన ఉంటుందని చెప్పిన సీఎం కేసీఆర్.. తాజా వర్షాకాల సమావేశాల్లో కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యారు.
ఇప్పటికే ప్రభుత్వం దీనిపై చర్యలు మొదలు పెట్టింది. వీఆర్వోల దగ్గరున్న రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని సీఎస్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్లందరూ రెవెన్యూ రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఇది జరిగిన కొన్ని గంటలకే విఆర్వోల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది. రిజిస్ట్రేషన్ శాఖలో భారీగా మార్పులు చేయడానికి సీఎం కేసీఆర్ రెడీ అయింది. రిజిస్ట్రేషన్లు ఎలా ఉండాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించనుంది. రిజిస్ట్రేషన్లలో ఎమ్మార్వో అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలను ఎమ్మార్వోలకు అప్పగించే ఆలోచనలో ఉంది. గృహ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్టార్లకు అప్పగిస్తారని అంటున్నారు.
అవినీతిని తగ్గించడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది అత్యంత కీలకమైనది. రెవిన్యూ వ్యవస్థలో ముఖ్యంగా భూ వ్యవహారాల్లో.. ఎలాంటి లావాదేవీలు జరగాల్సి ఉన్నా… పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడం సంప్రదాయంగా మారిపోయింది. అధికారులు తమ చేతుల్లో ఉన్న అధికారాలతో డబ్బు సంపాదనతో ఎంతో మందికి అన్యాయం చేశారు. మరోసారి అలాంటి పరిస్థితులు రాకూడదని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. మరి కొత్త చట్టం ఆ భరోసా ఇస్తుందో లేదోచూడాలి..!