మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం అంటే.. దేశం తనను తాను గౌరవించుకోవడం అని.. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఈ రోజు.. పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని ఆమోదించారు. దీన్ని కేంద్రానికి పంపనున్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఇప్పటికే ఘనంగా నిర్వహిస్తున్నామన్న కేసీఆర్.. దేశానికి మాజీ ప్రధాని చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధాని పదవి చేపట్టారని.. దార్శనికతతో ధైర్యంగా మందడుగు వేశారని ప్రశంసించారు.
ప్రధాని పదవి చేపట్టిన మొదటి దక్షిణాది వ్యక్తి… ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన రెండో వ్యక్తి పీవీ అని కేసీఆర్ పొగిడారు. పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణల బీజాల ఫలితాలే మనం అనుభవిస్తున్నామన్నారు. తీర్మానానికి కాంగ్రెస్ సహా అన్ని పార్టీల నేతలు మద్దతు తెలిపారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. ఇటీవలి కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పీవీని ఎక్కువగా అభిమానిస్తున్నారు. ఆయన చేసిన సేవలకు భారతరత్న ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు.. పీవీ శతజయంతి ఉత్సవాలు ఏడాది పాటు నిర్వహించి వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఘన నివాణులు అర్పించే కార్యక్రమం చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన పీవీకి చివరి దశలో సరైన ఆదరణ లభించలేదు. దేశాన్ని ఒడ్డుకు చేర్చిన నేత అయినప్పటికీ.. ఆయన చనిపోతే ఢిల్లీలో భౌతిక కాయాన్ని ఖననం చేయలేదు. హైదరాబాద్ పంపించారు. ప్రతీ ప్రధానికి ఢిల్లీలో ఘాట్లు ఉన్నాయి. కానీ… ఐదేళ్లు చేసిన ప్రధానికి మాత్రం.. ఆ గౌరవం ఇవ్వలేదు. వీటన్నింటిని కేసీఆర్ హైలెట్ చేస్తూ.. ఆయన సమైక్యాంధ్ర వాది అయినప్పటికీ.. తెలంగాణ తరపున వైతాళికుడిగా గుర్తించేందుకు వెనుకడుగు వేయడం లేదు.