రాజకీయాల్లో ఇప్పుడు మైండ్గేమ్ది ప్రధానపాత్ర. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ను ఎవరూ అధిగమించలేరు. మొదటగా ఆయన సర్వేలు చేయించానని.. అన్ని సీట్లు వస్తాయని హింట్ ఇస్తారు. దాని ప్రకారం… టీఆర్ఎస్ నేతలు..సోషల్ మీడియా.. క్యాంపెయిన్ ప్రారంభిస్తుంది. చివరికి అటూ ఇటూగా ఫలితం అలాగే సాధిస్తారు. ఈ మధ్యలో.. ప్రజల్లో గెలవబోయేది టీఆర్ఎస్నే మరో మాటకు చాన్స్ లేదు.. అనే భావన తెప్పిస్తారు. అలాంటి వ్యూహం… ముందు నుంచి అమలవుతోంది.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాగే చేశారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్న సమయంలోనూ.. అదే ప్లాన్ షురూ చేశారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా… ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన కేసీఆర్.. గ్రేటర్ ఎన్నికలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాము సర్వే చేయించామని.. వంద సీట్లకు అటు ఇటూగా వస్తాయని స్పష్టం చేశారు. కొంత మంది ఏదేదో ప్రచారం చేస్తున్నారని.. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందన్నారు. అదే సమయంలో.. గ్రేటర్లో బీజేపీకి అనుకూలంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఒకటో.. రెండో కార్పొరేట్ సీట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉన్న సీట్లు పోతాయని చెప్పారు.
నిజానికి గత బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ స్వీప్ చేసింది. టీడీపీకి ఒక్కటి.. కాంగ్రెస్కు ఐదు ఇలా.. సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే వచ్చాయి. టీఆర్ఎస్ చెప్పినట్లుగా 99 సీట్లను సాధించింది. ఈ సారి కూడా.. అదే స్థాయిలో ఫలితాలు సాధిస్తామన్న నమ్మకంతో ఉంది. కేటీఆర్ ఇటీవలి కాలంలో హైదరాబాద్లో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపనలు చేస్తున్నారు. గత బల్దియా ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు గేమ్ చేంజర్. అయిదేళ్లు అయినా ఎవరికీ ఇవ్వలేదు. అయితే.. 80వేల ఇళ్లు రెడీ చేశామని ఇవ్వడానికి సిద్ధమని.. కేటీఆర్ చెబుతున్నారు. ఈ క్రమంలో… కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల గురించి మాట్లాడారంటే.. సహజంగానే.. దృష్టి పెట్టారని అర్థం చేసుకోవచ్చు.