గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ ఎలా గెలవాలా అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసేసుకున్నారు. ఆయన సర్వేల పేరుతో ఎన్ని గెలుస్తామో కూడా చెప్పడం ప్రారంభించారు. మరో వైపు కేటీఆర్… భాగ్యనగరాన్ని హామీలతో ముంచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో… కాంగ్రెస్ పార్టీ .. టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి.. మల్కాజిగిరి ఎంపీగా ఆ బాధ్యత తీసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం.. తమ సహజసిద్ధమైన రాజకీయాల్ని మార్చుకోవడం లేదు. సమావేశాలలో బాహాబాహీకి దిగుతున్నారు.
గ్రేటర్ ఎన్నికలపై.. గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి… రాజకీయ వ్యూహాలను వివరించారు. ఏం చేయాలో.. ఎలా చేయాలో చెప్పారు. టీఆర్ఎస్ ఎలాంటి అడ్డదారులు తొక్కబోతోందో వివరించి.. వాటిని ఎదుర్కోవాలన్నారు. తక్కువ ఓట్లతో డివిజన్లు ఏర్పాటు చేశారని.. బోగస్ ఓట్లు వేయించేడం వంటి చర్యలకు పాల్పడేందుకు ప్రణాలికలు వేస్తున్నారని పార్టీ నేతలకు వివరించారు. ఓల్డ్ సిటీలోని డివిజన్లలో 15 నుంచి 30 వేల ఓట్లు ఉంటే ఇంకో దగ్గర 70, 80 వేలు ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ చేసేప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో లీగల్‌గా ఎప్పటికప్పుడు అప్రోచ్ కావడానికి లీగల్ టీమ్ సిద్ధంగా ఉండాలని సూచించారు. 150 డివిజన్లలో ముఖ్య నాయకులను గుర్తించి గడప గడపకు పాదయాత్ర చేసి వాళ్ళను నామినేట్ చేస్తే బాగుంటుందని సూచించారు. ప్రతి డివిజన్లలో డివిజన్‌కి మేనిఫెస్టో ప్రకటించాలని.. ఇలా.. చాలా చాలా ఆలోచనలు చెప్పారు.
అయితే.. కాంగ్రెస్ నేతలు మాత్రం.. మొత్తం ఎజెండాను మార్చేసుకున్నారు. ఒకరినొకరు తిట్టుకోవడం ప్రారంభించారు. శ్రవణ్, నిరంజన్.. ఒకరిపై ఒకరు దూసుకెళ్లి బూతులు తిట్టుకున్నారు. ఎవరి ఆధిపత్యం కోసం వారు ప్రయత్నించడంలో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తిట్టుకోవడం అయిపోయాక.., పీసీసీ చీఫ్ ఉత్తమ్ సర్దిచెప్పారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాంగ్రెస్ తీరు మారదని.. మీడియా ద్వారా ప్రజలకు స్పష్టత వచ్చింది. రేవంత్‌ది కంఠశోషగానే మిగిలిపోయింది. ఇలాంటి అనైక్యతతో .. టీఆర్ఎస్‌పై పోరాటం చేయడం సాధ్యం కాదనేది.. రాజకీయాలపై అవగాహన ఉన్నవారు చెప్పేమాట.