మీడియా అంటే ఏమిటి..? దానిలో జాతీయ మీడియా అనే హోదా ఉంటే ఏం చేస్తారు..? ఈ రెండు ప్రశ్నలకు ప్రస్తుతం జాతీయ మీడియా సమాధానం ఇస్తోంది. మీడియా అంటే.. కేవలం ప్రజల్ని ఎంటర్టెయిన్ చేయడం… జాతీయ మీడియా అంటే… జాతీయ స్థాయిలో ఎంటర్టెయిన్ చేసే వారి వివరాలను హైలెట్ చేయడం.. ఈ అర్థాల ప్రకారమే.. జాతీయ మీడియా చెలరేగిపోతోంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లేవీ.. తమకు పట్టవని చెబుతూ.. రోజువారీ ప్రసారాలను పూర్తిగా రియా చక్రవర్తి చుట్టూ తిప్పేస్తున్నాయి. సొంత ఇన్వెస్టిగేషన్ చేసి.. శిక్షలు ప్రకటించడానికి సిద్ధమవుతున్నాయి.
సుశాంత్ సింగ్… ఆత్మహత్య ఘటన జరిగినప్పటి నుండి సోకాల్డ్ నేషనల్ మీడియాకు.. రియా తప్ప.. మరో వార్త కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో చైనా భారత్లో దురాక్రమణకు పాల్పడుతోంది. కాల్పులు కూడా జరిపింది. ఇది చైనా దుస్సాహసం. సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. కానీ.. మీడియా పట్టిచుకోవడం లేదు. అదే సమయంలో… దేశంలో ఆర్థిక పరిస్థితి ఆందోళన కరంగా మారింది. జీడీపీ మైనస్ 24 శాతానికి పడిపోవడం అంటే.. ఎంత ప్రమాదకరమో… దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందో.. ఆర్థిక రంగంలో కామన్సెన్స్ ఉన్నవారికి తెలిసిపోతుంది. ఇలాంటి విషయాలను లైట్ తీసుకున్న మీడియా… రియా చక్రవర్తిని వేటాడటంలో బిజీగా ఉంది.
ఇప్పుడు రానున్న రోజుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని.. మీడియా చెలరేగబోతోంది. ఇప్పటికే రియా … నేషనల్ నార్కొటిక్స్ బ్యూరో అధికారుల విచారణలో బాలీవుడ్ స్టార్ల పేర్లు చెప్పిందని.. ప్రచారం ప్రారంభించేశారు. రేపట్నుంచి వారికి నోటీసులు.. వీరికి నోటీసులు అని బ్రేకింగ్ న్యూస్లు వేసుకుని.. అర్థం పర్థం లేని అరుపులతో టైం పాస్ చేసేస్తారు. ప్రజలకు వినోదాన్ని పంచుతారు. కానీ..దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులపై… ప్రజలకు అవగాహన కల్పిస్తారు..? నిజాలు ఎవరు చెబుతారు..? సినిమా నటులపైనే కాన్సన్ట్రేట్ చేస్తే ఫోర్త్ ఎస్టేట్ అనే పదానికి అర్థం ఉంటుందా..?