దేశం మొత్తం.. ఆన్ లాక్ అయిపోయింది. కానీ ఏపీ-తెలంగాణ మధ్య మాత్రం కావడం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రారంభం కావడం లేదు. ఆర్టీసీ సర్వీసులు ప్రారంభించాడనికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం ఆలోచన చేయడం లేదు. నిబంధనలు సడలించడంతో ప్రైవేటు బస్సులు మాత్రం రోడ్డెక్కాయి. తాము కట్టాల్సిన పన్ను కట్టి.. బస్సులు తిప్పడం ప్రారంభించారు. దీంతో… హైదరాబాద్ కు రాకపోకలు సాగించే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాస్త వెసులుబాటు దక్కింది. అయితే.. ప్రైవేటు బస్సుల దోపిడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో.. ప్రైవేటు బస్సులకు సందు ఇస్తే.. ఆర్టీకి మరణశాసనం రాసినట్లే అవుతుంది. అదే ఇప్పుడు.. ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసికి అత్యధిక ఆదాయం… హైదరాబాద్ రూట్ ద్వారానే వస్తుంది. రోజుకు వెయ్యికిపైగా బస్సులు ఏపీ నుంచి హైదరాబాద్కు వెళ్తాయి. అదే సమయంలో.. తాము కూడా ఏపీకి అదే స్థాయిలో బస్సులు నడుపుతామని టీఎస్ఆర్టీసీ డిమాండ్ చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ సమస్యా ఉండేది కాదు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సరిహద్దు ఏర్పడింది. తమ రాష్ట్రంలో బస్సులు తిప్పుకోవాలంటే.. తాము కూడా మీ రాష్ట్రంలో తిప్పుకుటామని తెలంగాణ అధికారులు బేరం పెట్టేశారు. తెలంగాణ డిమాండ్లను అంగీకరిస్తే ఏపీ బస్సులను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే.. ఆదాయం కూడా అదే స్థాయిలో పడిపోతుంది.
తెలంగాణతో ఆర్టీసీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. వాస్తవానికి అధికారికంగా ఆర్టీసీ విభజన పూర్తి కాలేదు. ఇలాంటి సమయంలో ఆంక్షలు పెట్టకూడదు. కానీ.. తెలంగాణ అధికారులు పెడుతున్నారు. ఈ కారణం కోర్టుకెళ్లాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇలా వివాదం సాగుతోంది కానీ పరిష్కారం వైపు పోవడం లేదు. ఇప్పుడు ప్రైవేటు బస్సులు విజృంభించేసిన తర్వాత తీరిగ్గా ఆర్టీసీ బస్సులను రోడ్డుపైకి తెచ్చినా ప్రయోజనం ఉండకపోవచ్చు.