బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన ‘పింక్’ని తెలుగులో ‘వకీల్ సాబ్’గా రీమేక్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కథానాయకుడు. వేణు శ్రీరామ్ దర్శకుడు. `వకీల్‌సాబ్` ఫస్ట్ లుక్‌పై కొన్ని విమర్శలు వచ్చాయి. ఫ్యాన్స్‌కి ఈ లుక్ నచ్చినా – కొంతమంది మాత్రం `ఇది మహిళల కథ కదా.. వాళ్లెవరూ లేకుండా పోస్టర్‌ని వదిలారేంటి` అని ప్రశ్నించారు. వీటిపై ఇప్పుడు దర్శకుడు వేణు శ్రీరామ్ సమాధానం ఇచ్చారు. “పవన్ అభిమానుల కోసం ఫస్ట్ లుక్‌ని ఆ విధంగా డిజైన్ చేశాం. అయితే నాకు తెలిసిన చాలామంది అమ్మాయిలు… `ఇది అమ్మాయిల కథ కదా. వాళ్లనిచూపించరా` అని అడిగారు. `మగువ` పాటలో మేం కేవలం అమ్మాయిల గురించే చెప్పాం. ఆ పాటలో… కనీసం పవన్ కల్యాణ్ ఫొటో కూడా చూపించలేదు. అమ్మాయిల్ని గౌరవించే సినిమా ఇది. `పింక్`లో వాళ్ల కోసం పాటేదీ లేదు. తమిళంలో వచ్చిన అజిత్ సినిమాలోనూ అంతే. ఆ రెండు చిత్రాలకు భిన్నంగా అమ్మాయిల గొప్పదనం విశ్లేషిస్తూ ఓ పాట ని రూపొందించాం. ఇదే కాదు.. ఈ సినిమాలో అమ్మాయిల కోసం మరో పాట కూడా ఉంది“ అన్నారు. ఈ చిత్రంలో మొత్తం 5 పాటలుంటాయన్నారు. కాకపోతే.. డాన్సింగ్ నెంబర్లేమీ ఉండవన్న క్లారిటీ ఇచ్చారు. “పవన్ నుంచి ఈ సినిమాలో డాన్సులు ఆశించలేం. ఆయన కాస్త స్టైలీష్ గా నడుచుకుంటూ వచ్చినా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతారు. ఆయన ఒకటి కాదు… చాలా గెటప్పుల్లో కనిపిస్తారు“ అని పవన్ ఫ్యాన్స్ కి నచ్చే ఓ అప్ డేట్ ఇచ్చారు వేణు.