తెలంగాణలో ఇక ఒక్క ఇంచ్ కూడా ఆక్రమణకు గురి కాదని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. అసెంబ్లీలో రెవెన్యూ బిల్లును కేసీఆర్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రెవిన్యూ సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరాన్ని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో… రెవెన్యూ బిల్లు పెడుతున్నప్పుడు అంతే సంతోషంగా ఉన్నానని.. ఈ బిల్లు కోసం మూడేళ్లుగా కసరత్తు చేశామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. భూ రికార్డుల ప్రక్షాళనతో కొంత ఫలితం వచ్చిందన్నారు. కొత్త రెవిన్యూ చట్టం అంశంపై బాధ్యతగా రెవెన్యూ అధికారులతో చర్చించామని .. ఏ చట్టం తెచ్చినా గౌరవిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారన్నారు.
ఉద్యోగులకు ఎలాంటి ముప్పు ఉండదని .. వీఆర్వోలను స్కేల్ ఎంప్లాయిస్గా మార్చుతామని హామీ ఇచ్చారు. తెలంగాణలోనిప్రతి ఇంచ్ భూమిని సర్వే చేయిస్తామని.. ఇకపై ఎవరూ పక్కవారి భూమిపై కన్నేయలేరని తేల్చి చెప్పారు. వ్యవసాయ భూములను ఇక నుంచి ఎమ్మార్వోలు రిజిస్ట్రేషన్ చేస్తారని .. నాన్ అగ్రికల్చర్ భూములను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేస్తారని కొత్త చట్టంలోని ప్రత్యేకతను కేసీఆర్ వివరించారు. ధరణి పోర్టల్ రెండు భాగాలుగా ఉంటుందని.. అందులో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ వివరాలు ఉంటాయన్నారు.
మొత్తం తెలంగాణ రాష్ట్ర భూభాగం 2.75కోట్ల ఎకరాలుగా ఉందని.. ఈ వివరాలన్నీ ధరణి పోర్టల్ పారదర్శకంగా ఉంటాయన్నారు. ప్రపంచంలో ఏమూలనైనా ధరణిని ఓపెన్ చేసి చూసుకోవచ్చన్నారు. ధరణి పోర్టలే అన్నింటికీ ఆయువు పట్టుని తేల్చారు. కొత్త చట్టం ప్రకారం ఏ అధికారికీ విచక్షణాధికారాలు ఉండవన్నారు. ఈ చట్టంపై సమగ్ర చర్చకు అవకాశం కల్పిస్తామని చెప్పిన కేసీఆర్.. ఇందు కోసం..శుక్రవారం కేటాయించారు.