బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. నిన్న అర్థరాత్రి హైదరాబాద్ లోని ఎస్.ఆర్ నగర్ లోని తన నివాసంలో శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. టిక్ టాక్ స్టార్ దేవరాజు రెడ్డి వేధింపులు భరించలేకే.. శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దేవరాజుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దేవరాజు కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. సాయి అనే మరో వ్యక్తి శ్రావణి వెంటపడేవాడని, తనని పెళ్లి చేసుకోమని వేధించేవాడని, పెళ్లి చేసుకోకపోతే… చంపేస్తానని బెదిరించేవాడని, అందుకోసం ప్రయత్నాలూ చేశాడని, తన వేధింపులు భరించలేకే… శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అంటున్నాడు దేవరాజు. ఇప్పుడు ఈ సాయి ఎవరు? సాయికీ.. శ్రావణికి ఉన్న సంబంధం ఏమిటన్న విషయంలో.. పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. సాయి అనే వ్యక్తి ఉన్నాడా? లేదంటే.. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి సాయి పేరుని బయటకు తెచ్చాడా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు. శ్రావణి కాల్ డేటాని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాల్ రికార్డ్స్ ద్వారా ఈ కేసుని ఛేదించాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి శ్రావణి ఆత్మహత్య లోనూ కొన్ని వెలుగు చూడని రహస్యాలు ఉన్నాయేమో అనిపిస్తోంది.