భారతీయ జనతా పార్టీ నేతలను.. పోలీసులు భద్రతంగా అంతర్వేది తీసుకెళ్లి కాలిపోయిన రథాన్ని చూపించారు. ఉదయం అంతా.. బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అంతర్వేదిలో సెక్షన్ 30 అమలులో ఉందని.. ఎవరూ రాకూడదని పోలీసులు ముందస్తుగా బీజేపీ , జనసేన నేతల్ని అరెస్ట్ చేశారు. దానికి కారణం.. బీజేపీ, జనసేన ఉమ్మడిగా చరో అంతర్వేదికి పిలుపునివ్వడమే. బీజేపీ నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడంతో… ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం అని నిలదీశారు.
ఈ విమర్శల ధాటికి భయపడ్డారో మరో కారణమో కానీ.. కాసేపటికే… అంతర్వేదికి వెళ్లేందుకు బీజేపీ, జనసేన నేతలకు అవకాశం ఉంది. పోలీసుల ఆంక్షలతో పరిమిత సంఖ్యలో నేతలకు అనుమతి ఇవ్వడంతో… సోము వీర్రాజు నేతృత్వంలో అందరూ వెళ్లి రధాన్ని చూశారు. ఆలయాల్లో వరుస ఘటనల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని.. అంతర్వేది ఘటన పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని సోము వీర్రాజు ప్రకటించారు.
బీజేపీ, జనసేన శ్రేణులు తమ ఇళ్లలో లక్ష్మీనర్సింహస్వామి విగ్రహాలు పెట్టి నిరసన తెలపాలని.. 11న ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు ఏదైనా ఆందోళనకు పిలుపునిస్తే.. గృహనిర్బంధాలు చేయడమే కాదు.. సాయంత్రం వరకూ వదిలి పెట్టేవారు కాదు. కానీ బీజేపీ నేతలకు మాత్రం పోలీసులే క్లియరెన్స్ ఇచ్చి అంతర్వేదికి తీసుకెళ్లారు.