ఆంధ్రప్రదేశ్లో వితంతు పెన్షన్లు పొందుతున్న మహిళలు.. భర్త చనిపోకపోయినా…చనిపోయారని చెప్పి పెన్షన్లు పొందుతున్నారట. ఈ విషయాన్ని ఎవరో కాదు ప్రభుత్వమే నేరుగా హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం వేసిన అఫిడవిట్ చూసి.. న్యాయమూర్తే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కారణాలతో పెద్ద ఎత్తున సామాజిక భద్రత పెన్షన్లు తొలగింాచారు. ఇలా పెన్షన్లు కోల్పోయిన వారిలో 175 మంది వరకూ హైకోర్టును ఆశ్రయించారు. పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలు కావడంతో.. హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేసింది. వారందరికీ భర్తలు ఉన్నా అబద్దాలు చెప్పారని అందుకే తొలగించామని చెప్పుకొచ్చింది.
భర్త ఉండి కూడా పెన్షన్ కోసం లేరని చెప్పుకునే పరిస్థితి ఉండదని కోర్టు అభిప్రాయపడింది. భారతీయ వివాహ వ్యవస్థ అత్యంత పవిత్రమైందని వివాహం జరిగిన తర్వాత భర్త ఉండి కూడా ఏ మహిళా వితంతు అని చెప్పదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఎటువంటి విచారణ లేకుండా కనీసం నోటీస్ కూడా జారీ చేయకుండా పెన్షన్లు నిలిపివేయటం సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని హైకోర్టు తీర్పు చెప్పింది. 15 రోజుల్లోగా నిలిపివేసిన పెన్షన్ అన్నింటిని వెంటనే పునరుద్ధరించాలని .. భవిష్యత్ లో కూడా ఈ పెన్షన్లను కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
కులం, పార్టీలను చూస్తూ..ఈ ప్రభుత్వం లబ్దిదారులను విభజిస్తోందని మొదటి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ పార్టీ మద్దతు దారులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చివరికి సామాజిక పెన్షన్లు కూడా అలాగే ఇస్తూండటంతో కోర్టులోమరోసారి ఎదురు దెబ్బ తినాల్సి వచ్చింది.