చంద్రబాబు బీజేపీని తొక్కేశారు.. ఆయన పార్టీని మేం తొక్కేస్తాం అని.. సోము వీర్రాజు ఇటీవలి కాలంలో ఆవేశ పడుతున్నారు. చంద్రబాబు పొత్తు పెట్టుకుని బీజేపీని ఎదగకుండా చేశారని సోము వీర్రాజు పదే పదే చెబుతూ ఉంటారు. అందుకే ఇప్పుడు తాను పార్టీని పైకి లేపుతానని.. చంద్రబాబును తొక్కేస్తానని చెబుతూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షంపై విరుచుకుపడితే… అధికారపక్షానికి మిత్రపక్షంగా ముద్ర పడుతుంది కానీ.. ప్రజలు ప్రత్యామ్నాయంగా గుర్తించరు. ఈ విషయం తెలిసినా సోము వీర్రాజు…ముందుకే వెళ్తున్నారు. అప్పుడే చంద్రబాబు బీజేపీని తొక్కేశాడని అంచనా వేసుకుంటున్న దాని కన్నా.. ఇప్పుడు తానే బీజేపీని ఎక్కువ తొక్కేస్తున్నానన్న విషయాన్ని సోము వీర్రాజు గుర్తించినా.. గుర్తించనట్లుగా ఉండిపోతున్నారు.
వైసీపీ అధికార ప్రతినిధుల్ని మించి టీడీపీపై వీర్రాజు విమర్శలు.. !
ఆంధ్రప్రదేశ్లో జనసేనతో కలిసి అధికారం చేపట్టడమే ఆలస్యమని.. ఎక్కడికి వెళ్లినా ప్రెస్మీట్లలో మొదటి వాక్యంగా చెప్పడం అలవాటు చేసుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… దాని కోసం సిద్ధం చేసుకున్న రూట్ మ్యాప్… ముందుకెళ్తుందో.. వెనక్కి వెళ్తుందో.. ఏపీ బీజేపీ నేతలకు అర్థం కావడం లేదు. ఆయన ప్రభుత్వానికి నొప్పి పుట్టకుండా విమర్శలు చేసి… ఏ ఘటన జరిగిన వెంటనే.. దాన్ని ప్రతిపక్షం వైపు మళ్లించేందుకు ట్రాఫిక్ పోలీసులా వ్యవహరిస్తూండటమే దీనికి కారణం. సోము వీర్రాజు మాట్లాడే మాటలు… చేసే విమర్శలు కరుడుగట్టిన వైసీపీ నేతలా ఉండటమే కాదు.. అంతకు మించి విపక్షంపై ఆరోపణలు చేస్తూ అధికార పార్టీకి ఆనందం కలిగిస్తున్నారు.
టీడీపీ గుళ్లు కూలగొడితే ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఏం చేయలేదా..?
బీజేపీ అంటే హిందూత్వ బ్రాండ్. అంతర్వేది లాంటి ఘటనలు జరిగినప్పుడు దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి బీజేపీ ఎంత చేయగలదో.. ఇతర రాష్ట్రాల్లో చూశాం. కానీ ఏపీలో మాత్రం హిందూ సంఘాలు ఉద్యమించాయి కానీ… బీజేపీ మాత్రం.. ఇంట్లో నుంచి కాళ్లు బయటపెట్టలేదు. హిందూ సంఘాలు మంత్రుల్ని అడ్డుకుని రచ్చ రచ్చ చేసిన తర్వాత బాగుండదేమో అని.. సోము వీర్రాజు చలో అంతర్వేదికి పిలుపునిచ్చారు. అయితే అంతకు ముందే ఆయన ప్రభుత్వంపై ఈగ వాలకుండా.. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అదేమిటంటే.. టీడీపీ హయాంలో విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ కోసం గుళ్లు కూలగొట్టించారని.. టీడీపీ హిందూత్వం గురించి మాట్లాడటం ఏమిటనేది ఆయన వాదన. ఆయన కోపం ఎందుకు వచ్చిందంటే.. బీజేపీ కన్నా ముందుగానే టీడీపీ .. అంతర్వేది ఘటనను ఖండించింది. నిజ నిర్ధారణ బృందాన్ని పంపింది. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోంది. దీంతో.. సోము వీర్రాజుకు కోపం వచ్చింది. ప్రభుత్వంపైనే విరుచుకుపడతారా.. అని రంగంలోకి వచ్చారు.
అంతర్వేది ఇబ్బందుల నుంచి వైసీపీని గట్టెకించే ప్రయత్నమా..?
విజయవాడలో గుళ్లు కూలగొట్టారో లేదో ఎవరికీ తెలియదు. ఏ గుళ్లు కూలగొట్టారో ఇంత వరకూ ఎవరూ చెప్పలేదు. అప్పట్లో ఉత్తరాదికి చెందిన గుళ్ల తొలగింపు ఫోటోలు తెచ్చి విజయవాడ ఫోటోలు అని ప్రచారం చేశారు. నిజానికి అప్పుడు బీజేపీకి చెందిన మాణిక్యాలరావు దేవాదాయమంత్రిగా ఉన్నారు. మొత్తం ఆయన కనుసన్నల్లోనే వ్యవహారం నడుస్తుంది. ఈ విషయం సోము వీర్రాజుకు.. గుర్తు లేకుండా ఏమీ ఉండదు. తాము చేసే విమర్శలు తమ మీదే పడతాయని తెలిసినా.. హిందూ వ్యతిరేక ముద్ర వేస్తాయని ఊహించినా.. ఆయన టీడీపీ – బీజేపీ పాలనపైనే విమర్శలు చేస్తున్నారు. ఇదంతా… అంతర్వేది ఘటనను.. వీలైనంత తక్కువ చేసి.. వైసీపీని ఇబ్బందుల నుంచి బయట పడేయడానికి ఆయన పడుతున్న ప్రయాస అని సులువుగా అర్థమవుతోందని బీజేపీ నేతలు గొణుక్కుంటున్నారు.
ఎక్కడికి వెళ్లినా వైసీపీ పాలనకు కితాబులిచ్చి..టీడీపీని తిడితే ప్రత్యామ్నాయం అవుతారా..?
ఒక్క అంతర్వేది ఘటన కాదు.. కొద్ది రోజుల కిందట పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలోనే ఎక్కున నిర్మాణం జరిగిందని కితాబిచ్చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క శాతం కూడా నిర్మాణం జరగలేదని రికార్డులు చెబుతున్నాయి. అయినా ఆయన వైసీపీ నేతలకు మించి కితాబిచ్చేశారు. ఏం జరిగినా ఆయన ముందుగా టీడీపీనే విమర్శిస్తున్నారు. వైసీపీ జోలికి మాత్రం పోవడం లేదు. అవినీతిని నిలదీస్తాం.. నిలదీస్తాం.. అని నిలబడి చెబుతున్నారు కానీ… ఆ తర్వాత కూర్చుండిపోతున్నారు. మద్యం దగ్గర్నుంచి నిలదీయడానికి సోము వీర్రాజుకు కావాల్సినన్ని అస్త్రాలున్నాయి. అయితే.. ఆయనకు… అవేమీ కనిపించవు. అమరావతికి కేంద్రం రూ. ఏడు వేల కోట్లిచ్చిందని.. అవేం చేశారో చెప్పాలని అడుగుతూ ఉంటారు. అది తెలుసుకోవాలంటే పెద్ద విషయమా..?