శివసేన ఇమేజ్ ఎలాంటిది..?. మరాఠాల మీద ఎవరైనా చిన్న మాట అన్నా.. వారు మళ్లీ మహారాష్ట్రలో అడుగుపెట్టే సాహసం చేయాలంటే… ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే.. శివసైనికులకు.. చట్టాలపై పట్టింపు లేదు. ముందుగా దాడి చేస్తారు.. తర్వాత జరిగేదేదో జరగనీ అన్నట్లుగా ఉంటారు. ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ జరగకుండా రాత్రికి రాత్రి పిచ్ తవ్వేసిన చరిత్ర వారిది. మహారాష్ట్రలో ఉద్యోగాలకు పరీక్షలు రాయకుండా బీహార్ వారిని కొట్టిన రికార్డు వారికి ఉంది. కానీ ఇప్పుడు ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చిన కంగనను మాత్రం.. వారు ఏమీ చేయలేకపోతున్నారు. కారణం వారు అధికారంలో ఉండటమే.
ప్రతిపక్షంలో ఉంటే ఏమైనా చేయవచ్చు…కానీ అధికారంలో ఉంటే మాత్రం కాస్తయిన బాధ్యత ఉండాలి. శివసేన అ బాధ్యత ఫీలయింది. అధికారంతో… కంగనను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. కానీ అదీ విమర్శలకు కారణం అయింది. తమపై విమర్శలు చేస్తున్న కంగనకు షాక్ ఇవ్వడానికి ముంబైలోని ఆమె ఆఫీసును.. అక్రమ నిర్మాణం అని కూల్చేశారు బీఎంసీ అధికారులు. కానీ.. శివసేన అధికారంలో లేకుండా.. శివసైనికులు.. ఆ పని చేసి ఉంటే.. ఆదో ధీరోదాత్తమైన పని అయి ఉండేది. కానీ అధికారంలో ఉండటం వల్ల శివసేన తప్పు చేసిందనే విమర్శలు ఎదుర్కొంటోంది. మహారాష్ట్రను కంగన అవమానించిందని.. ఆమె వ్యాఖ్యలను తాము సమర్థించబోమని.. బీజేపీ నేతలు కూడా అంటున్నారు కానీ.. ఆమె ఆఫీసును కూలగొట్టడాన్ని మాత్రం సమర్థించడం లేదు.
కంగన ఇప్పటి వరకూ జగడాల మారిగానే బాలీవుడ్ చూసేది. ఆమె అందరిపై విమర్శలు చేస్తుంది. తనకు సూపర్ హిట్లిచ్చిన దర్శకులపైనా ఆరోపణలు చేసింది. సహ నటులనూ వదిలి పెట్టలేదు. హృతిక్ పై ఎన్నో ఆరోపణలు చేసి.. తీరా ఆధారాలు బయటపడే సరికి సైలెంటయింది. ఇక మణికర్ణిక దర్శకుడు క్రిష్ క్రెడిట్ కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆమె వివాదాలకు అంతే లేదు. తాజాగా.. సుషాంత్ కేసులో ప్రతి మలుపులోనూ జోక్యం చేసుకుంటోంది. మొదట నెపోజిటం మీద విమర్శలు చేసింది. తర్వాత సీఎం కుమారుడ్ని టార్గెట్ చేసింది.. ఇప్పుడు డ్రగ్స్ కేసులోనూ అదే చెబుతోంది. ఆమె వ్యాఖ్యలను అక్కడి మీడియా హైలెట్ చేస్తోంది.దానిపై శివసేన అతిగా స్పందించడంతో ఇప్పుడు… ఆమెకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది.