మాజీ భారతీయ జనతా పార్టీ నేత.. ప్రస్తుత వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అచ్చమైన హిందూత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలు కూడా చేయలేని విధంగా ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ… ముందుకెళ్తున్నారు. అంతర్వేది ఘటనపై ఆయన ఏపీ బీజేపీ నేతల కన్నా.. ఎక్కువగా.. ఘాటుగా స్పందించారు. కుట్ర కోణం ఉందనే అనుమానాల్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు.. ఆయన తన హిందూత్వ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. దేవాలయాల పరిరక్షణకు దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.
శుక్రవారం రోజు ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల మీద దాడులకు నిరసనగా ఢిల్లీలోని నివాసంలో గాంధేయ పద్దతిలో 8 గంటల పాటు దీక్ష చేయనున్నారు. దాడుల ఘటనలపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలనేది రఘురామకృష్ణరాజు ప్రధానమైన డిమాండ్. ఆలయాలపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతర్వేది ఘటన జరిగినప్పటి నుండి ఆయన .. ప్రభుత్వం తీరుపై … హిందూత్వ కోణంలోనే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మతం ఎదైనప్పటికీ.. ముఖ్యమంత్రిగా అన్ని మతాలను గౌరవించాల్సి ఉందని.. తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
ముందు నుంచి హిందూ సంప్రదాయాలపై ప్రత్యేకమైన ఆసక్తి చూపించే రఘురామకృష్ణరాజు వైసీపీతో విబేధించిన తర్వాత ఎక్కువగా ఈ దిశగా ప్రకటనలు చేస్తున్నారు. అయోధ్య రామాలయం విషయంలో మోడీని అదే పనిగా ప్రశంసిస్తూ పత్రికలకు కథనాలు రాశారు. అందరి కంటేముందుగా ఆలయానికి విరాళం కూడా ప్రకటించారు. తన హిందూత్వ వాదంతో బీజేపీ పెద్దలను ఆకట్టుకుటున్నారు. అయితే.. ఆయన దూకుడైన హిందూత్వ వాదం వైసీపీ నేతలకే కాదు.. ఏపీ బీజేపీ నేతలకూ మింగుడు పడటం లేదు. ఎందుకంటే.. వారిది వైసీపీకి ఇబ్బంది రాకూడని హిందూత్వ వాదం మరి..!