తెలుగు తెరకు అడల్ట్ కామెడీని పరిచయం చేసిన వాళ్లలో రవిబాబు ఒకడు. `అల్లరి` అలాంటి సినిమానే. అల్లరి విజయంతో అలాంటి కథలు వరుస కట్టాయి. ఆ తరవాత… రవిబాబు హారర్, థ్రిల్లర్ జోనర్ బాట పట్టాడు. మళ్లీ ఇంత కాలానికి ఓ అడల్ట్ కామెడీ కథని ఎంచుకున్నాడు. అదే… `క్రష్`. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల మధ్య సాగే.. శృంగార భరిత గాథ ఇది. టీజర్ చూపించడానికి ముందే.. `18 సంవత్సరాలు దాటిన వాళ్లకు మాత్రమే` అని గట్టిగా చెప్పేశారు కూడా. దాన్ని బట్టి… ఈ టీజర్ లో విషయం ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు.
రవిబాబుకీ – ఈ సినిమాలో నటిస్తున్న ముగ్గురు అబ్బాయిలకూ మధ్య సాగే ప్రశ్నోత్తరాల కార్యక్రమంలా టీజర్ కట్ చేశారు. అమ్మాయిల్ని చూడగానే… వాళ్ల శరీర భాగాల్లో జరిగే అసంకల్పితన ప్రతీకార చర్యలు, వాటిని కంట్రోల్ చేసుకునే పద్దతుల మీద సాగే చర్చలా సాగింది ఈ టీజర్. టిఫిన్లు, భోజనాలు, బఫే.. అంటూ శృంగార విషయంలో జరిగే కోడ్ భాష మొత్తం డైలాగుల్లో పెట్టేశాడు రవిబాబు. అంగాంగ వర్ణనలు, సెక్స్ భంగిమలు.. ఒకటేంటీ… అన్నీ ఈ టీజర్లో ఉన్నాయి. కచ్చితంగా ఇది ఓటీటీ కోసం చేసిన సినిమాలా ఉంది. సెన్సార్ జరగాలంటే మాత్రం కష్టమే.