తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అపుడప్పుడు యాగాలు, హోమాలు చేస్తుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్నడూ అటువంటి ప్రయత్నాలు చేయలేదు. కేసీఆర్ విజయపధంలో దూసుకుపోతుంటే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి దాదాపు రెండేళ్ళు పూర్తి కావస్తున్నా అడుగడుగునా అవరోధాలు, అగ్నిపరీక్షలు ఎదుర్కోక తప్పడం లేదు. బహుశః కేసీఆర్ చేస్తున్న చండీ యాగాల కారణంగానే అసాధ్యం అనుకొన్నవాటిని కూడా ఆయన సాధించగలుగుతున్నారేమో? అయినా నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు ఎటువంటి యజ్ఞాలు, యాగాలు చేయాలని ప్రయత్నించలేదు కానీ ఆయన వియ్యంకుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విశాఖలోని చినముషివాడ ప్రాంతంలో గల శారదా పీఠంలో స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో నిన్న మాహా కుంభాభిషేకం యాగంలో పాల్గొన్నారు.
ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ “సమర్దుడయిన ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పధంలో సాగిపోతున్నప్పటికీ, రాష్ట్రాభివృద్ధికి దైవానుగ్రహం, దైవబలం కూడా అవసరం. అందుకే ఈ యాగంలో పాల్గొన్నానని చెప్పారు. రాష్ట్రానికి కొన్ని గ్రహదోషాలున్నట్లు స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి గుర్తించి వాటి నివారణ కోసమే ఈ యాగం చేసారని తెలిపారు. బాలకృష్ణ చెప్పినదానిని బట్టి చూస్తే ఆయన వ్యక్తిగత హోదాలో కాక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ యాగంలో పాల్గొన్నట్లు అర్ధమవుతోంది. అంటే కేసీఆర్ చేస్తున్న యజ్ఞయాగాదుల ఎఫెక్ట్ చంద్రబాబు నాయుడుపై కూడా పడిందనుకోవాలా? అందుకే తన తరపున బాలకృష్ణ చేత యాగాలు చేయిస్తున్నారేమో? అలాగయితే బాలకృష్ణ మున్ముందు చాలా యాగాలలో పాల్గొనవచ్చును. బాలకృష్ణతో బాటు ఎంపి ఎం.శ్రీనివాస రావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, బండారు సత్యనారాయణ, పీల గోవింద సత్యనరాయణ, తెదేపా నేతలు, అధికారులు పాల్గొన్నారు.