పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు.. కేంద్రంతో ఎలా వ్యవహరించాలన్నదానిపై ఓ క్లారిటీకి వచ్చాయి. జీఎస్టీ పరిహారం నిధుల దగ్గర్నుంచి ప్రతీ విషయంలోనూ కేంద్రం మొండిచేయి చూపిందని ఆగ్రహంతో ఉన్న కేసీఆర్… పార్లమెంట్లో బీజేపీపై తవ్ర స్థాయిలో విరుచుకుపడాలని నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఏ విషయంలోనూ ఇక కేంద్రంతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడాలని ఆయన స్పష్టంగా చెప్పి.. ఎంపీలను ఢిల్లీకి పంపించారు. దీంతో టీఆర్ఎస్… నేరుగా.. ప్రభుత్వంపై ఫైట్ చేయడం ఖాయమైపోయింది.
అయితే.. తెలంగాణకు ఎలా కేంద్రం సహాయనిరాకరణ చేస్తుందో.. ఏపీకి కూడా.. అంతే చేస్తోంది. జీఎస్టీ పరిహారం కాదు కదా.. ఇతర సాయం కూడా ఏమీ చేయడం లేదు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం టీఆర్ఎస్ పద్దతిలో ఫైటింగ్‌కు వెళ్లదల్చుకోలేదు. జీఎస్టీ పరిహారం ఇవ్వకపోయినా అప్పులు ఇస్తే చాలున్నట్లుగా ఉంది. ఇప్పటికే అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి సీఎం జగన్ సంతోషపడుతున్నారు . ఇక కేంద్రం నుంచి రావాల్సిన ఇతర విషయాలపైనా.. ప్రభుత్వానికి పెద్దగా పట్టింపు ఉన్నట్లుగా లేదు. అందుకే కేంద్రంతో ఇప్పుడు పోరాడాల్సిన అవసరమే లేనట్లుగా వ్యవహరిస్తోంది.
ఉమ్మడిగా పోరాడి… తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు సాధించుకుందామని గతంలో.. కేసీఆర్, జగన్ నిర్ణయించుకున్నారు. కానీ ఏడాది దాటే సరికి.. బీజేపీ విషయంలో.. కేంద్రం విషయంలో ఎవరి దారి వారిదే అవుతోంది. కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోణంలో అయినా బీజేపీతో తలపడటానికి సిద్ధపడుతున్నారు కానీ.. జగన్ మాత్రం.. బీజేపీకి ఎదురెళ్లడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. మూడు రాజధానుల దగ్గర్నుంచి అనేక రాజకీయ పరమైన అంశాల్లో తమకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నందు వల్ల ఇప్పుడు కనీసం.. ప్రశ్నించాల్సిన అవసరం లేదని.. భావిస్తూ ఉండవచ్చు.