జ్యోతిక మంచి పని చేస్తోంది. నటిగా తనకంటూ ఓ స్థాయి వచ్చాక.. `చెప్పాల్సిన` కథల్ని వెదికి పట్టుకుంటోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా.. ఆ కథల్ని చెప్పుకుంటూ పోతోంది. జ్యోతిక ఈమధ్య చేసిన సినిమాలన్నీ పరిశీలించండి. అందులో ఏదో ఓ సామాజిక అంశాన్ని పట్టుకుని, ప్రేక్షకుల్ని జాగృతం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తోందనిపిస్తోంది. ఆర్థిక పరమైన లెక్కల జోలికి పోకుండా. తాజాగా విడుదలైన `బంగారు తల్లి` కూడా అలాంటి కథే. ఆ తరహా ప్రయత్నమే.
జ్యోతి అనే మహిళ కొంతమంది పసి పిల్లల్ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమారుస్తుంది. ఆమెను అడ్డుకున్న ఇద్దరు కుర్రాళ్లని నాటు తుపాకీతో కాల్చి చంపేస్తుంది. ఈ కేసుని వెన్నెల (జ్యోతిక) అనే లాయరు మళ్లీ తవ్వి తీస్తుంది. జ్యోతి అమాయకురాలని, ఆమెను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాదిస్తుంది. ఆమె ఈ కేసులో గెలిచిందా? లేదా? జ్యోతి ఎవరు? ఆమె నిజంగా సైకోనా? జ్యోతికీ. వెన్నెలకీ సంబంధం ఏమిటన్నదే.. `బంగారు తల్లి`.
ఈ సినిమా క్లైమాక్స్ లో వెన్నెల ఓ ప్రశ్న వేస్తుంది. మనింట్లో పెరుగుతున్న అమ్మాయిలకు ఇలాంటి దుస్తులు వేసుకోకు, అలా మాట్లాడకు, ఇలా చూడకు… అని రకరకాలుగా చెబుతుంటాం. కానీ.. మన ఇంట్లో పెరుగుతున్న అబ్బాయిలకు మాత్రం అమ్మాయిల్ని ఇలా గౌరవించు, వాళ్లతో ఇలా ప్రవర్తించకు అని మాత్రం ఎందుకు చెప్పం? అని. ఇదే ప్రశ్న ప్రతీ ఇంట్లోనూ ఉదయిస్తే – అసిఫా లాంటి పసి హృదయాలు గాయపడవు. పసి కందులపై జరుగుతున్న అన్యాయాల్ని, అఘాయిత్యాల్ని సూటిగా ప్రశ్నించే సినిమా ఇది. మనం పేపర్లో చదివి పారేసే ఓ వార్త వెనుక ఉన్న బాధని తెలియజెప్పే కథ ఇది. అందులో ఎంత డ్రామా ఉంది? కోర్టు వాదనల్లో ఎంత ఇంటెలిజెన్స్ ఉంది? సినిమాలో ఎంత కమర్షియాలిటీ ఉంది? అనే లెక్కలు పక్కన పెట్టి ఆలోచిస్తే – ఈ కథలో ఎంతో అర్థ్రత ఉందనిపిస్తుంది.
ఇదో కోర్టు డ్రామా. పింక్ లాంటి సినిమాలు చూసినవాళ్లకు వాదోపవాదనల్లో ఇంటిలిజెన్స్ పెద్దగా కనిపించకపోవొచ్చు. కానీ… లోతుగా ఆలోచిస్తే, ఇలాంటి నిజాలు ఎన్నిసార్లు పక్కదోవ పట్టాయో అనిమాత్రం అనిపిస్తుంది. ఇంట్రవెల్ ట్విస్టు.. దానికి అనుసంధానంగా వచ్చిన క్లైమాక్స్ ట్విస్టు.. రక్తి కట్టించాయి. సినిమాటిక్ గా అనిపించినవి కూడా అవే. కోర్టు డ్రామాలో అంత గొప్ప మలుపులేం లేవు. ఇదో భారమైన కథ. దానికి తగ్గట్టే కథనం సాగింది. తొలి రెండు నిమిషాలకే కథంతా చెప్పేశారు. ఆ కథ చెబుతున్నప్పుడే జ్యోతిపై ఈ కేసు అనవసరంగా బనాయించారనిపిస్తుంది. దాంతో వెన్నెల ఈ కేసుని తవ్వి తీస్తున్నప్పుడు ఏమంత షాకింగ్‌గా అనిపించదు. కోర్టు డ్రామాలో సెంటిమెంట్ కి ఎక్కడా తావులేదు. తెలివితేటలకు తప్ప. ఈ కథలో సెంటిమెంట్ మాత్రమే కనిపిస్తుంది.
జ్యోతిక తన స్థాయికి తగిన పాత్రల్ని ఎంచుకుంటోంది. అలాంటి మరో మంచి పాత్ర ఇది. కోర్టులో వరద రాజుల్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ పాత్రలోని హీరోయిజం బయటపడింది. భాగ్యరాజ్ పాత్రని మరింత బాగా వాడుకోవాల్సింది. పార్తీబన్ లాయర్ కావడం వల్ల కోర్టు డ్రామా కొంతయినా రక్తి కట్టింది. డబ్బింగ్ లో నాణ్యత లేదు. సీజీల్లో తమిళ పేర్లని చెరిపేయడానికి సైతం దృష్టి పెట్టలేదు. సన్నివేశాల్లో అరవ అతి కనిపిస్తూనే ఉంటుంది. జ్యోతిక తన పరంగా ఓ మంచి కథ చెప్పడానికి ప్రయత్నించింది. ముందే చెప్పినట్టు… ఆర్థిక పరమైన లెక్కల్ని పక్కన పెట్టి చూస్తే, ఇది ఆలోచించదగిన అంశమే.