ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి రూ.6,792కోట్లను పంపిణీ చేశారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. రెండో ఏడాది నుంచి అమలు చేసి వరుసగా నాలుగేళ్ల పాటు ఇస్తామన్నారు. ఈ ప్రకారం.. ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 18,750 ఇచ్చేందుకు పథకం రూపొందించారు. ఈ ప్రకారం.. ముందుగా ప్రకటించినట్లుగా ఈ రోజు ఖాతాలకు నగదు బదిలీ చేశారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్ మీట నొక్కి ఆయన నగదు ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ పథకం ద్వారా 8.71 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 87 లక్షల మంది మహిళలు లబ్ది పొందుతారు.
రూ. 18,750తో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని మహిళలకు సీఎం జగన్ సూచించారు. వ్యాపారాలు చేయాలనుకునే వారికి ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తుందని ప్రకిటంచారు. వ్యాపారాలు చేయాలనుకుంటే.. ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న పలు కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానం చేస్తామని… తక్కువ ధరలకు ఉత్పత్తులను అందించడంతోపాటు మార్కెటింగ్ చేసేందుకూ ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు.
ఏపీలో డ్వాక్రామహిళలు దాదాపుగా కోటి మంది వరకూ ఉన్నారు. అయితే.. ఈ పథకానికి 87 లక్షల మందిని మాత్రమే లబ్దిదారులుగా ఎంపిక చేశారు. మిగిలిన వారిని ఏ ప్రాతిపదిన అనర్హతకు గురి చేశారో క్లారిటీ లేదు. అయితే.. రుణాలు చెల్లించిన వారికి నిరాశ ఎదురయిందని.. చెల్లించని వారికి మాత్రమే ఏప్రిల్ 11, 2019 నాటికి కటాఫ్ డేట్‌గా పెట్టుకోవడంతో… పలువురు పథకంలో లబ్ది పొందలేకపోయారంటున్నారు. అదే సమయంలో ఒక్కో లబ్దిదారులకు రూ. 18750 అందడం కూడా అసాధ్యంగా మారింది. 87 లక్షల మందికి రూ. రూ.6,792 కోట్లను సగటు చేస్తే ఒక్కొక్కరికి ఎనిమిది వేలకు అటూ ఇటూగానే అందే అవకాశం కనిపిస్తోంది. అందుకే విపక్షాలు మోసం అని విమర్శలు గుప్పిస్తున్నాయి.