అమ్మాయిలకు రెండు పేర్లే కాదు. రెండు జీవితాలు కూడా. పెళ్లికి ముందు ఒకటి, పెళ్లయ్యాక ఒకటి. పెళ్లితో అమ్మాయిల జీవితం పూర్తిగా మారిపోతుంది. కొత్త బంధాలొస్తాయి. కొత్త కట్టుబాట్లు వస్తాయి. స్వేచ్ఛ హరించుకుపోతుంది. పెళ్లికి ముందున్న ఆలోచనలు, ఆశయాలు పెళ్లితో సమాధి అయిపోతాయి. ఒకప్పటి స్నేహితుల్నీ మర్చిపోయి ఆ నాలుగు గోడలకూ పరిమితమైపోయి జీవించాల్సివస్తుంది. అలాంటి ముగ్గురు మహిళలకు – మూడు రోజుల పాటు స్వేచ్ఛ కలిపిస్తే, వాళ్ల జీవితం వాళ్లకు తిరిగి ఇస్తే – అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన కథ `మగువలు మాత్రమే`. తమిళంలో రూపొందిన `మగలీర్ మత్తం` అనే చిత్రానికి అనువాద రూపమిది. తమిళంలో ఎప్పుడో విడుదలైంది. ఇప్పుడు డబ్ చేసి `ఆహా`లో వదిలారు.
గోమాత (ఊర్వశి), రాణీ అమృత (భానుప్రియ), సుబ్బు (శరణ్య) ముగ్గురూ మంచి స్నేహితులు. ఇంటికి దూరంగా హాస్టల్ లో ఉండి చదువుకున్నారు. ఆ తరవాత.. పెళ్లిళ్లు చేసుకుని ఎవరి జీవితాల్లో వాళ్లు స్థిరపడిపోయారు. ఎవరి బాధలు వాళ్లవి. ఎవరి కష్టాలు వాళ్లవి. జీవితం అంతా యాంత్రికమైపోతున్న తరుణంలో… ఈ ముగ్గురునీ ప్రభ (జ్యోతిక) కలపాలనుకుంటుంది. వాళ్ల సంతోషాల్ని తిరిగి తీసుకురావాలనుకుంటుంది. మరి.. ఈ ముగ్గురి స్నేహితుల మూడు రోజుల ప్రయాణం ఎలా జరిగింది? వాళ్లు పంచుకున్న ఆనందాలు, సంపాదించిన అనుభూతులు, తిరగేసిన జ్ఞాపకాలు ఎలాంటివి? అన్నదే `మగువలు మాత్రమే`.
రీ యూనియన్ లాంటి కథ ఇది. కాకపోతే.. ఇప్పటి వరకూ ప్రేమికులు తిరిగి కలుసుకోవడం చూశాం. ఇది ముగ్గురు పాత స్నేహితులు తిరిగి కలుసుకోవడం. అందునా గృహిణులు. పెళ్లితో ఆడవాళ్లు ఏం కోల్పోతున్నారో? ఇంట్లో ఉంటున్న అమ్మకో, చెల్లెకో, భార్యకో ఎలాంటి విలువ ఇవ్వాలో చెప్పే ప్రయత్నం ఇది. ముగ్గురు స్నేహితుల హాస్టల్ జ్ఞాపకాలు, వాళ్ల అల్లరి సరదాగా ఉంటుంది. ఆ ముగ్గుర్ని కలపాలన్నది మంచి ఆలోచన. ఎందుకంటే జ్ఞాపకాల్ని తవ్వుకోవడం, ఆ అనుభూతుల్లో కేరింతలు కొట్టడం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. కాబట్టి… దర్శకుడికి మంచి ఫ్లాట్ ఫామ్ దొరికింది. పైగా ముగ్గురి నేపథ్యం విభిన్నమైనది. వాళ్ల ఇంట్లో పరిస్థితులు, వాళ్లు అనుభవిస్తున్న జీవితం.. వాటిలో వైవిధ్యం ఉంది. కాబట్టి… కొత్త సన్నివేశాల్ని చూసే అవకాశం దక్కుతుంది.
అయితే ఈ నేపథ్యాన్ని, వెసులుబాటునీ దర్శకుడు కొంత వరకే వాడుకున్నాడనిపిస్తుంది. ముగ్గురు స్నేహితులు, దాదాపు ముఫ్ఫై ఏళ్ల తరవాత కలుసుకుంటే ఎంత హంగామా ఉంటుంది? ఎంత అనుభూతి ఉంటుంది. దాన్ని సరిగా ఆవిష్కరించలేదనిపిస్తుంది. వీళ్ల ఫ్లాష్ బ్యాకే బాగుంటుంది కానీ, ఆ మూడు రోజుల్లో చేసిన విన్యాసాలు, చేసిన సందడి ఏమంత గుర్తుండిపోయేలా ఉండదు. ఈ మూడు రోజుల్లో వాళ్ల జ్ఞాపకాల్ని వెదుక్కుంటూ, కోల్పోయింది మళ్లీ దక్కించుకుంటూ ప్రయాణం సాగించాలి. ఆ ప్రయాణం.. కాస్త చప్పగా, కాస్త నెమ్మదిగా, బాగా బోరింగ్ గా ఉంది. అమ్మకి దూరమైన కొడుకులోనూ, భార్య విలువ తెలుసుకున్న భర్తలోనూ మార్పు.. సహజంగా కాకుండా కృతకంగా ఉంటుంది. దర్శకుడి ఆశయం, ఆలోచన మంచిదే. కానీ.. ఇంకాస్త ఎఫెక్టీవ్ స్క్రీన్ ప్లేతో ఈ కథని నడపాల్సింది.
జ్యోతిక వయసుకి తగిన కథల్ని ఎంచుకుంటోంది. తన నటన కూడా సహజంగా ఉంటోంది. ఈసారీ అంతే. భానుప్రియ, శరణ్య, ఊర్వశి… వీళ్ల గురించి చెప్పేదేముంది? మాధవన్ అతిథి పాత్రలో దర్శనమిచ్చాడు. ఆడవాళ్ల విలువ, గొప్పదం, వాళ్లు కోల్పోతున్న జీవితం… ఇదీ స్థూలంగా కథ. వాటికి సంబంధించిన చర్చ జరిగింది ఈ సినిమాలో. నదులకు ఆడవాళ్ల పేర్లే ఎందుకు పెడతారు? అని ఓ పాత్ర అడిగితే.. నదుల్ని, ఆడవాళ్లనీ దేవుళ్లతో సమానంగా చూడాలని చెప్పడానికే అంటుంది మరో పాత్ర. కానీ మనం నదుల్ని శుభ్రం చేసుకోం – ఆడవాళ్లనీ గౌరవించుకోం – అనే మాటని దర్శకుడు ఆ సన్నివేశం ద్వారా చెప్పకనే చెప్పాడు. దర్శకుడి భావం మంచిదే. దాన్ని ఇంకాస్త ఎంటర్టైనింగ్ గా చెప్పాల్సింది. ముగ్గురు స్నేహితుల మూడు రోజుల ప్రయాణంలో ఇంకొన్ని మెరుపులు ఉంటే బాగుండేది.