ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమయింది. ఆలస్యం కాకుండా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికలతో పాటు ఉపఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికపై దృష్టి పెట్టాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ సీటును మళ్లీ గెలిపించడానికి మంత్రి హరీష్ రావు బాధ్యత తీసుకున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభ్యర్థిగా చనిపోయిన రామలింగారెడ్డి కుటుంబసభ్యులకే అవకాశం కల్పించడం దాదాపు ఖాయమే.
దుబ్బాకలో మంచి పేరు ఉన్న చెరుకు ముత్యం రెడ్డి కుటుంబం ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉంది. ఆయన కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎలాగైనా పోటీ చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోతే.. కాంగ్రెస్ పార్టీలో చేరి అయిన పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఒక వేళ అక్కడా చాన్స్ రాకపోతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయాలనుకుంటున్నారు. దీని కోసం గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారు. దీంతో టీఆర్ఎస్‌కు రెబల్ సమస్య ఖాయంగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మొదటి నుంచి గందరగోళంగానే ఉంది. మొదట ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోటీ చేయబోమని ప్రకటించారు. కానీ ఉత్తమ్ మాత్రం… తాను చెప్పేదే ఫైనల్ అని.. పోటీ చేసి తీరుతామని చెప్పారు. ఆయన శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎవరిని నిలబెట్టాలో అర్థంకాని పరిస్థితి. 2018 లో పోటీ చేసి ఓడిపోయిన మద్దుల నాగేశ్వర రెడ్డి పత్తాలేరు. విజయశాంతిని నిలబెడితే ఎలా ఉంటుందా అన్న చర్చ కూడా నడుస్తోంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ్మ ఉపఎన్నిక బాధ్యత తీసుకున్నారు
బీజేపీ తరపున రఘునందన్ రావు రేసులో ఉన్నారు. ఆయన తప్ప మరో గట్టి అభ్యర్థి లేకపోవడంతో ఆయన పోటీ చేయడం ఖాయమే. ఇప్పటికే రఘునందన్ రావు ప్రచారం కూడా మొదలుపెట్టారు.. తెలంగాణ జనసమితి కూడా ఈ స్థానం నుండి పోటీ చేయాలని కసరత్తు చేస్తోంది.ఈ విషయమై కమిటీ వేసింది. సాధారణంగా.. ఓ ఎమ్మెల్యే చనిపోతే.. ఆ స్థానానికి జరిగే ఉపఎన్నికపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించరు. కానీ ఈ సారి అలా లేదు. సాధారణ ఎన్నికలా పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది.