నాని ఓ మంచి ఎంటర్టైనర్. తన కామెడీ టైమింగ్ తో, సహజమైన నటనతో కొన్ని సాధారణమైన కథల్ని సైతం నిలబెట్టాడు. హిట్టు సినిమాలుగా మార్చాడు. ఫ్యామిలీ డ్రామాలకూ, లవ్ స్టోరీలకూ, సరదా కథలకు నాని పర్ఫెక్ట్గా సూటైపోతాడు. జస్ట్ ఫర్ ఛేంజ్ అన్నట్టుగా `గ్యాంగ్ లీడర్`, `వి` సినిమాలు ప్రయత్నించి చూశాడు. రెండూ థ్రిల్లర్ కథలే. `వి`లో అయితే ఏకంగా విలన్ రోల్ లో కనిపించాడు. అయితే ఈ రెండు ప్రయత్నాలూ ఘోరంగా బెడసికొట్టాయి. `గ్యాంగ్ లీడర్` సినిమా ఫ్లాప్ అయినా, ఆ సినిమా ద్వారా నాని ఎంతో కొంత ఎంటర్టైన్ చేయగలిగాడు. `వి` అయితే పూర్తి భిన్నం. నానిని ఇలాంటి పాత్రలో చూడ్డానికి ప్రేక్షకులు బాగా ఇబ్బంది పడ్డారు. నాని సైకోగా చూడలేకపోయారు. దాంతో ప్రయోగం పూర్తిగా బెడసికొట్టింది.
నాని మినిమం గ్యారెంటీ హీరో. ఓ మామూలు కథని సైతం నిలబెట్టగలడు. కథ, పాత్రలో అద్భుతాలేం అవసరం లేదు. జస్ట్ ఎంటర్టైన్ చేస్తే చాలు. అది వదిలేసి, ప్రయోగాల బాట పట్టాడు నాని. తనకు సూట్ కాని కథల్ని, పాత్రల్ని ఎంచుకోవడం మొదలెట్టాడు. ఓరకంగా… నాని తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకున్నాడు. కానీ… ఫలితాలు రాలేదు. ఇక మీదట నాని పూర్తిగా తన పాత పంథాలోనే నడవాలని భావిస్తున్నాడట. తనకు సూటయ్యే రొమాంటిక్ కామెడీలూ, ఫ్యామిలీ డ్రామాలే చేయాలని ఫిక్సయ్యాడట. ప్రస్తుతం లైనప్ చేస్తున్న సినిమాల్లో ఇవే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. `టక్ జగదీష్` తో నాని మళ్లీ ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా సీరియస్ ఎమోషన్లూ, సెంటిమెంట్ సీన్లూ కొన్ని ఉన్నాయని తెలుస్తోంది. వాటిని వీలైనంత ట్రిమ్ చేసి, ఎంటర్టైన్మెంట్ పై దృష్టి పెట్టమని దర్శకుడు శివ నిర్వాణకు సూచించినట్టు తెలుస్తోంది. శివ కూడా నాని సూచనలకు అనుగుణంగా స్క్రిప్టులో కొన్ని కీలకమైన మార్పులు చేస్తున్నట్టు సమాచారం. వచ్చే నెలలో `టక్ జగదీష్` సెట్స్‌పైకి వెళ్లనుంది.