పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంపిణీ చేస్తున్నందున నిధుల సమీకరణ కోసం పన్నులు పెంచక తప్పడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. గతంలో పెట్రోల్, డీజిల్‌తో పాటు రిజిస్ట్రేషన్ చార్జీల వరకు పన్నులు పెంచిన ప్రభుత్వం తాజా.. సహజవాయువుపై వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సహజవాయువుడు కేటగిరిలోకి ఎల్పీజీ కూడా వస్తుంది. అంటే.. ప్రతీ కుటుంబం వాడుకునే వంట గ్యాస్ ధర పెరగనుంది. ప్రస్తుతం.. 14.5 శాతం ఉన్న వ్యాట్‌ను 24.5 శాతానికి పెంచుతున్నారు. అంటే పది శాతం పన్ను పెరుగుతోంది. ఒక్కో సిలిండర్‌పై దాదాపుగా యాభై రూపాయల వరకూ పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే కరోనా కారణంగా ఆదాయం పడిపోయిందని.. ఐదు రకాల పెట్రోలియం ఉత్పత్తులపై విలువ ఆధారిత పన్నును ప్రభుత్వం పెంచింది. ముడి చమురుపై 5 శాతం, పెట్రోలుపై 31 శాతంతో పాటు… అదనంగా 4 రూపాయల మేర పన్ను వసూలు చేస్తోంది. డీజిల్‌పై 22.5 శాతంతో పాటు అదనంగా 4 రూపాయల మేర వ్యాట్ వసూలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో… పెట్రోల్, డీజిల్ రేట్లు దేశంలోనే అత్యధికం ఉన్నాయని గగ్గోలు పెట్టిన పెట్టిన నేతలు.. గత ప్రభుత్వం తగ్గించిన రేట్లను.. తాము అధికారంలోకి రాగానే మొహమాటం లేకుండా పెంచేశారు. ఇప్పుడు అదనంగా గ్ాస్ పైనా వడ్డిస్తున్నారు.
పన్నుల భారం మోపడానికి ప్రభుత్వం కారణాలను … పథకాలనే చూపిస్తోంది. రైతు భరోసా, నాడు నేడు, టెలిమెడిసిన్, సున్నావడ్డీ, జగనన్న విద్యా దీవెన, వాహన మిత్ర, జగనన్న చేదోడు , అమ్మఒడి పథకాలకు నిధుల కోసం…పన్నులు పెంచుతున్నట్టు జీవోల్లోనే వెల్లడించింది. ప్రజలకు పంచడానికి పన్నుల రూపంలో మళ్లీ ప్రజల దగ్గరే వసూలు చేయడం ఏమిటన్న అభిప్రాయం సామాన్యుల్లో వ్యక్తమవుతోంది. ప్రజల వద్ద పన్నులు రూపంలో పిండి… ఓటు బ్యాంకుకు సంక్షేమ పథకాలు అమలు చేయడం ఏమిటన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ముందు ముందు మరింత బాదుడు ఖాయమని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది.